రాహుల్ గాంధీపై అనర్హత వేటును తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్
- పార్లమెంటులో రాహుల్ గాంధీపై అనర్హత వేటు
- మోదీ దురహంకారానికి పరాకాష్ఠ అంటూ కేసీఆర్ విమర్శలు
- ప్రజాస్వామ్యానికి చేటు కాలం దాపురించిందని వ్యాఖ్య
- బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను అందరూ ఖండించాలని పిలుపు
రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా, అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం అని సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటు కాలం దాపురించిందని, మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోందని మండిపడ్డారు. విపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వెలిబుచ్చారు.
నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నేతలపై అనర్హత వేటు వేయడం ద్వారా మోదీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీల మధ్య ఉండే వైరుద్ధ్యాలకు ఇది సందర్భం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని పేర్కొన్నారు.