Bandi Sanjay: సిట్ ను నమ్మను.. సమాచారం ఇవ్వను.. అయినా, అసలు నోటీసులే రాలేదు: బండి సంజయ్

  • పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కు సంజయ్ లేఖ
  • మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో స్పందిస్తున్నట్లు వెల్లడి
  • అధికారుల ఎదుట ఈ రోజు విచారణకు హాజరుకాలేనని వివరణ
bandi sanjay written a letter to the sit investigating the tspsc paper leakage case

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. నోటీసులు తనకు అందలేదని, మీడియాలో వచ్చిన సమాచారం మేరకే స్పందిస్తున్నానని చెప్పారు. సిట్ అధికారుల ఎదుట ఈ రోజు తాను విచారణకు హాజరుకాలేనని చెప్పారు.

సిట్పై తనకు నమ్మకం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తన దగ్గరున్న సమాచారాన్ని సిట్కు ఇవ్వదల్చుకోలేదని స్పష్టం చేశారు. నమ్మకం ఉన్న దర్యాప్తు సంస్థలకే తన దగ్గరున్న వివరాలను అందిస్తానని తెలిపారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 

‘‘ఈ నెల 24న నేను హాజరు కావాలని సిట్ కోరినట్లు మీడియా ద్వారానే తెలిసింది. అయితే పార్లమెంట్ సభ్యునిగా నేను సభకు హాజరు కావాల్సి ఉంది. నేను కచ్చితంగా హాజరుకావాలని అధికారులు భావిస్తే.. మరో తేదీ చెప్పాలి’’ అని లేఖలో కోరారు.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ ఆరోపణలు చేయగా.. ఆయనకు సెక్షన్ 91 సీఆర్ పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. గ్రూప్ 1 ప్రశ్నపత్రాల లీకేజీపై సంజయ్ చేసిన ఆరోపణలపై ఈనెల 21న పత్రికల్లో కథనం ప్రచురితమైనట్లు నోటీసుల్లో పేర్కొంది. ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని కోరింది.

More Telugu News