Delhi Capitals: డబ్ల్యూపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals rams into WPL final
షార్ట్స్‌లో చూడండి
భారత్ లో ఈ ఏడాది తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. చివరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. తహ్లియా మెక్ గ్రాత్ 58 పరుగులతో అజేయంగా నిలిచింది. కెప్టెన్ అలీసా హీలీ 36, శ్వేతా సెహ్రావత్ 19 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆలిస్ కాప్సే 3, రాధా యాదవ్ 2, జొనాసెన్ 1 వికెట్ తీశారు. 

అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 39, ఆలిస్ కాప్సే 34, మరిజేన్ కాప్ 34 (నాటౌట్), షెఫాలీ వర్మ 21 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడగా, ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు, 2 ఓటములతో మొత్తం 12 పాయింట్లు సాధించి నెంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ కూడా 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించినా, రన్ రేట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ పొజిషన్ లో నిలిచింది. 

ఇక, మార్చి 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ మార్చి 26న ముంబయి బ్రాబోర్న్ స్టేడియంలో జరగనుంది.
Go Back to Shorts
Delhi Capitals
Final
WPL
UP Warriorzz

More Telugu News