38 bank accounts: లోన్ కోసం వెళ్లిన వ్యక్తికి షాక్.. ఒకే పేరుతో 38 అకౌంట్లు!

  • వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌ లో ఇల్లు కట్టుకుంటున్న అనంతయ్య
  • లోన్‌ కోసం స్థానిక ‘ఐఐఎఫ్‌ఎల్‌’ ఆఫీసుకు వెళ్లగా షాక్ ఇచ్చిన సిబ్బంది
  • మొత్తం 38 అకౌంట్లు ఉన్నాయని, అందులో 12 యాక్టివ్‌లో ఉన్నాయని వెల్లడి
  • అతని పేరుతో ఓ మోపెడ్‌ లోన్‌ కూడా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
man who went to take loan for the construction of a house got a big shock


అసలే టెక్నాలజీ యుగం. మన చేతిలో ఉన్న ఫోన్ నుంచి.. మనకు తెలియకుండా డబ్బు కొట్టేసే కేటుగాళ్లు ఉన్నారు. మనకు తెలియకుండానే లోన్లు తీసుకోవడం, అకౌంట్లు ఓపెన్ చేయడం.. చనిపోయిన వాళ్ల ఆధార్ నంబర్ తో సిమ్ లు తీసుకోవడం.. ఇలా ఎన్నో సైబర్ నేరాల గురించి వింటూనే ఉన్నాం. వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిది ఇలాంటి పరిస్థితే. 

వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన అనంతయ్య.. తన కొత్త ఇంటి నిర్మాణ పనులను 50 శాతం పూర్తి చేశాడు. మిగతా నిర్మాణానికి లోన్‌ కావాలని స్థానిక ‘ఐఐఎఫ్‌ఎల్‌’ సంస్థ వద్దకు వెళ్లాడు. లోన్‌ కావాలని అడగ్గా.. అక్కడి సిబ్బంది చెప్పిన విషయంతో అనంతయ్య షాక్ అయ్యాడు. 

ఆయన పేరిట ఒకటా రెండా ఏకంగా 38 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు సిబ్బంది చెప్పారు. అందులో 12 అకౌంట్లు యాక్టివ్‌లో ఉన్నాయని, మిగతా 26 క్లోజ్‌ అయ్యాయని, ఓ మోపెడ్‌ లోన్‌ కూడా ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో అవాక్కవడం అనంతయ్య వంతు అయింది.

దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తన ధ్రువపత్రాలు, ఫోన్‌ నంబర్‌ వాడి బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేశారని, లోన్‌ కూడా తీసుకున్నారని ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.

More Telugu News