AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ.. సభ వాయిదా!

  • జీఓం నెం.1పై సభలో ఉద్రిక్తత
  • జీఓను రద్దు చేయాలంటూ టీడీపీ డిమాండ్
  • పరస్పరం సవాళ్లు విసురుకున్న ఎమ్మెల్యేలు
  • టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ, వైసీపీఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య వాగ్వాదం 
  • తమపై దాడి చేశారంటూ ప్రభుత్వ ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరస్పర ఆరోపణలు
  • తీవ్ర ఉద్రిక్తతల మధ్య సభ వాయిదా
Ap assembly adjourned as tensions raise between tdp and ycp mlas

జీఓ నెం.1 రద్దుకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో నేడు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో.. స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు జీఓ నెం.1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. క్వశ్చన్ అవర్ ప్రారంభమైన వెంటనే జీఓ నెం.1పై చర్చకు పట్టుబట్టారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌కు ఏం చేయాలో నిర్దేశిస్తున్నారంటూ టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులను హరించవద్దంటూ టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు తమ హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని స్పీకర్ సూచించారు. దీంతో..టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. 

ఈ క్రమంలో వైసీపీ సభ్యులు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, డిప్యుటీ సీఎం అంజన్ బాషా, మల్లాది విష్ణు..టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు..టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద తమ నిరసన కొనసాగించారు. ఈ దశలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద రాజు తీర్మానాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. ఇంతలో స్పీకర్ పోడియం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే సభ వాయిదా పడింది. అయితే.. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోను విడుదల చేయాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.   

More Telugu News