Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగానే గొప్పగా ఫీల్ అవుతున్నారు... 2024 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు: కాకాణి

2024 elections will be last elections for Chandrababu says Kakani Govardhan
  • చంద్రబాబుకు ఇవే ఆఖరి విజయోత్సవాలు అన్న కాకాణి
  • మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్య
  • ప్రజల ప్రాణాలు కాపాడటానికే జీవో నెంబర్ 1 అని వెల్లడి
ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇవే ఫలితాలు 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతాయని ఆయన అన్నారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ... మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే గొప్పగా ఫీల్ అవుతున్నారని... ఇక తనకు తిరుగులేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి విజయోత్సవాలు అని చెప్పారు. 2024 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు అవుతాయని అన్నారు. 

మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని... ఆయనకు గోకర్ణ, గజకర్ణ విద్యలన్నీ తెలుసని కాకాణి విమర్శించారు. వర్షాలు ఆగిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని చెప్పారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని... తమ ప్రభుత్వం అంగన్ వాడీల సమస్యల పట్ల తగిన విధంగా స్పందిస్తుందని చెప్పారు.
Chandrababu
Telugudesam
Kakani Govardhan Reddy
YSRCP

More Telugu News