Narendra Modi: ఆరు రోజుల క్రితం మోదీ ప్రారంభించిన హైవే.. చిన్న వానకే ఇలా..!

Bengaluru Mysuru Expressway Road Waterlogged Post Light Rain
  • కర్ణాటకలోని రామనగర జిల్లాలో అండర్‌ బ్రిడ్జిలో భారీగా నిలిచిన నీరు
  • స్వల్ప ప్రమాదాలు.. భారీగా ట్రాఫిక్ జామ్
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
  • ఈ హైవేని పూర్తిగా సిద్ధం చేశాకే ప్రారంభించారా? అని ప్రశ్నిస్తున్న ప్రయాణికులు
కర్ణాటకలో ఆరు రోజుల కిందట బెంగళూరు-మైసూరు హైవేని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రూ.8,480 కోట్లతో 118 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించారు. కానీ శుక్రవారం రాత్రి కురిసిన చిన్న వర్షానికే జలమయమైంది. రామనగర జిల్లాలో హైవేపై ఉన్న అండర్‌ బ్రిడ్జిలో నీరు నిలిచిపోయింది. 

దీంతో స్వల్ప ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాహనాలు మెల్లగా ముందుకు కదులుతుండటంతో హైవేపై చాలా సేపు ట్రాఫిక్ జామ్‌ అయింది. నిజానికి గతేడాది ఇదే అండర్ బ్రిడ్జి వార్తల్లో నిలిచింది. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు వరద నీటితో నిండిపోయింది.  

ఇప్పుడు చిన్న వానకే వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. అసలు ఈ హైవేని పూర్తిగా సిద్ధం చేశాకే ప్రారంభించారా? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘నా మారుతి స్విఫ్ట్ కారు.. నీళ్లలోనే సగం మునిగిపోయింది. దీంతో అక్కడే ఆగిపోయింది. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీనికి ఎవరు బాధ్యులు? నా కారును రిపేర్ చేయించాలని సీఎం బసవరాజ్ బొమ్మైని కోరుతున్నా’’ అని వికాస్ అనే వ్యక్తి చెప్పారు. 

118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు - మైసూరు ఎక్స్ ప్రెస్ వేను మార్చి 12న ప్రధాని ప్రారంభించారు. ఈ రోడ్డు వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 3 గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుందని అధికారులు చెప్పారు. కానీ చిన్నపాటి వానకే నీటితో నిండిపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
Narendra Modi
Bengaluru-Mysuru highway
Ramanagara district
underbridge flooded

More Telugu News