Pawan Kalyan: బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా అధికార పార్టీ కుట్రలు పన్నుతోంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on ruling party in AP
  • అధికార పక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందన్న పవన్
  • తిరుపతిలో ఈ కుతంత్రాలు మొదలయ్యాయని వెల్లడి
  • ఈ ఉచ్చులో ఎవరూ పడొద్దని పిలుపు
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు అధికార పక్షం కుట్రలు పన్నుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

కులాల మధ్య అంతరాలు తగ్గించి, అందరి మధ్య సఖ్యతను పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోందని, ఆ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోందని పవన్ మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం అందుతోందని, ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయని వెల్లడించారు. ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా, ఈ తరహా కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. 

"ఇవాళ తిరుపతి కావొచ్చు... రేపు మరొక ప్రాంతం కావొచ్చు. బలిజలకీ, యాదవులకు మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా, భేదభావాలతో ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాల వారు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలి. అందరూ ఒకతాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Pawan Kalyan
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News