Graduate MLC Elections: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం.. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆధిక్యంలో టీడీపీ

  • ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీ అభ్యర్థుల ముందంజ
  • పశ్చిమ రాయలసీమలో వైసీపీ అభ్యర్థికి ఆధిక్యం
  • అనంతపురం, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం
TDP Leading In AP Graduate MLC Elections

ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై ప్రస్తుతం 18,371 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. 

మరోవైపు, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో ఉంది. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 9,558 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లు ముగిసే సరికి శ్రీకాంత్‌కు 49,173 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శ్యామ్‌‌ప్రసాద్‌రెడ్డికి 39,615 ఓట్లు పోలయ్యాయి. 

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లు ముగిసేసరికి రవీంద్రరెడ్డికి  28,872 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పోలయ్యాయి. ఇక, అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి 169 ఓట్లతో గెలుపొందగా, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కలిగిన చంద్రశేఖర్‌రెడ్డి సుమారు 2 వేల ఓట్లతో విజయం సాధించారు.

More Telugu News