pharmacy apps: ఈ - ఫార్మసీలు ఇక మీదట పనిచేయవా?

  • నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన
  • కఠిన నియంత్రణలపై కేంద్రం దృష్టి
  • నూతన బిల్లును తీసుకురానున్న సర్కారు
Govt may soon ban pharmacy apps like Tata 1mg NetMeds Medibuddy and more here is why

ఈ-ఫార్మసీల (ఎలక్ట్రానిక్ రూపంలో పనిచేసేవి/డిజిటల్ ప్లాట్ ఫామ్ లు) విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కఠిన వైఖరి అవలంబించనుంది. టాటా 1ఎంజీ, నెట్ మెడ్స్, ఫార్మ్ ఈజీ తదితర సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తుండడంతో వీటిపై కఠిన నియంత్రణలు అమలు చేయడం లేదా నిషేధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తున్నట్టు సమాచారం. డేటా గోప్యత, అవకతవకలు, ఆధారాల్లేకుండా మందులు విక్రయించడం వంటి ఆరోపణలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే మందులను విక్రయించాలి. కానీ, చాలా ఈ ఫార్మసీలు వైద్యుల ప్రిస్కిప్షన్ ను సొంతంగా జారీ చేయించి విక్రయిస్తున్నాయి.

మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్ బిల్లు, 2023 డ్రాఫ్ట్ బిల్లు ప్రస్తుతం మంత్రిత్వ శాఖల అంతర్గత చర్చల క్రమంలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కేంద్ర సర్కారు అవసరమైతే ఆన్ లైన్ ఫార్మసీలను నియంత్రించడం, కట్టడి చేయడం లేదంటే ఆన్ లైన్ లో ఔషధాలను విక్రయించకుండా నిషేధించే అధికారాలు కలిగి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 స్థానంలో నూతన బిల్లును చట్ట రూపంలోకి తేవాలన్నది కేంద్ర సర్కారు సంకల్పంగా ఉంది.

ఆన్ లైన్ ఫార్మసీలపై ఇంతకాలం పెద్దగా పర్యవేక్షణ ఉండడం లేదు. కానీ, ఇకమీదట వాటి పనితీరు, నియంత్రణపై కేంద్రం దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ ఫార్మసీల ద్వారా విక్రయించే మందుల సామర్థ్యం, కచ్చితత్వంపై ఆందోళనలు వస్తుండడంతో కేంద్రం మరింత కఠిన విధానాన్ని తీసుకురానుంది. 

More Telugu News