కోటంరెడ్డి నమ్మక ద్రోహి.. అసెంబ్లీలో అంబటి రాంబాబు మండిపాటు!

minister ambati rambabu fires kotamreddy sridhar reddy
  • చంద్రబాబు, టీడీపీ కోసం కోటంరెడ్డి పని చేస్తున్నారన్న అంబటి
  • దురుద్దేశంతోనే సభలో ఆందోళన చేస్తున్నారని ఆరోపణ
  • నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు ఉండవని వ్యాఖ్య
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. సభను అడ్డుకునేందుకే కోటంరెడ్డి వచ్చారని విమర్శించారు. ‘‘కోటంరెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా? ఆయనో నమ్మక ద్రోహి. చంద్రబాబు, టీడీపీ కోసం పని చేస్తున్నారు’’ అని ఆరోపించారు. 

టీడీపీతో కోటంరెడ్డి చేతులు కలిపారని అంబటి రాంబాబు మండిపడ్డారు. దురుద్దేశంతోనే సభలో ఆందోళన చేస్తున్నారని, కోటంరెడ్డి నైతిక విలువలు లేని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు మెప్పు కోసమే మాట్లాడుతున్నారన్నారు. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. 

అంతకుముందు నేటి ఉదయం సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు. క్వశ్చన్ అవర్‌లో సభ్యులు మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. శ్రీధర్ రెడ్డి నిరసనను ప్రభుత్వం, తాను గుర్తించామని స్పీకర్ అన్నారు.

దీంతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చే వరకు అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానని, తన నిరసనను ప్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
Go Back to Shorts
Ambati Rambabu
Kotamreddy Sridhar Reddy
AP Assembly Session
Chandrababu
TDP
YSRCP

More Telugu News