Andhra Pradesh: ఏపీలో రోగిని తరలిస్తున్న అంబులెన్సులో భారీ పేలుడు.. రూ. 40 లక్షల పొగాకు పంట దగ్ధం

  • ప్రకాశం జిల్లా పామూరు మండలంలో ఘటన
  • ఆక్సిజన్ సిలిండర్ పేలి పక్కనే పొలంలో పడిన శకలాలు
  • అక్కడ నిల్వచేసిన పొగాకు మండెలు ధ్వంసం
  • శకలాలు తగిలి ఓ వ్యక్తికి గాయాలు
Fire erupted in 108 ambulance in Andhrapradesh

ఏపీలో రోగిని తరలిస్తున్న అంబులెన్సులో మంటలు చెలరేగి, ఆపై పేలుడు సంభవించిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడడంతోపాటు రూ. 40 లక్షల విలువైన పొగాకు నిల్వలు కాలిబూడిదయ్యాయి. ప్రకాశం జిల్లా పామూరు మండలం రజాసాహెబ్‌పేటలో నిన్న జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన పి.ఏసురాజు కిడ్ని సమస్యలతో బాధపడుతున్నాడు. డయాలసిస్ కోసం 108 అంబులెన్సులో ఆసుపత్రికి వెళ్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా డ్రైవర్ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అంబులెన్స్ పైలట్ తిరుపతిరావు వాహనాన్ని నిలిపివేసి ఈఎంటీ మధుసూదన్‌రెడ్డిని అప్రమత్తం చేశాడు.

వెంటనే లోపలున్న రోగి, ఆమె తల్లిని కిందికి దించారు. ఆ వెంటనే అంబులెన్సులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో వాహన శకలాలు పక్కనే ఉన్న గ్రామానికి చెందిన రైతు పొలంలో పడ్డాయి. అక్కడ నిల్వ చేసిన దాదాపు రూ.40 లక్షల విలువైన పొగాకు నిల్వలకు మంటలు అంటుకోవడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. వాహన శకలాలు తగిలి తీవ్రంగా గాయపడిన సాధినేని వరదయ్యను ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

More Telugu News