Team India: ఓడిన శ్రీలంక.. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు టీమిండియా!

india book world test championship final berth as sri lanka fail to beat new zealand
  • న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఓడిన శ్రీలంక
  • డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమణ
  • పాయింట్ల పరంగా రెండో స్థానంతో ఫైనల్లోకి టీమిండియా
  • జూన్ లో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫోరు
సంచలనమేమీ జరగలేదు.. శ్రీలంక అద్భుతమేదీ చేయలేదు.. అంతా అనుకున్నదే జరిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టింది. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో ఓడిన శ్రీలంక.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో గెలుపోటములతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్ బెర్తు దక్కించుకుంది. జూన్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. కానీ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ ఒక్క గెలుపుతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఆసీస్ దూసుకెళ్లగా.. మన జట్టు ఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.

మన జట్టు నేరుగా ఫైనల్ కు చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తప్పక నెగ్గాలి. ఒకవేళ నాలుగో టెస్టులో టీమిండియా ఓడినా, లేక డ్రా చేసుకున్నా.. శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ అయినా శ్రీలంక ఓడిపోవాలి. ఇప్పుడు అదే జరిగింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఫలితం తేలే అవకాశాలు కనిపించడం లేదు. ఐదో రోజు ఆట కొనసాగుతోంది. డ్రా అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఓడిపోవడంతో మనకు లైన్ క్లియర్ అయింది. శ్రీలంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని 8 ఎనిమిది వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఛేదించింది.

ఇక చివరి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతూ లీడ్ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసి.. 31 పరుగుల లీడ్ లో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశాలు లేవు.
Team India
world test championship
WTC final
Team New Zealand
Sri Lanka
Australia

More Telugu News