Chardham yatra: చార్ ధామ్ యాత్రకు కొనసాగుతున్న రిజిస్ట్రేషన్

  • ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది నమోదు
  • ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు వస్తారని అంచనా
  • గతేడాది రికార్డు స్థాయిలో 47 లక్షల మంది హాజరు
Nearly 3 lakh people registered for char dham yatra till now

వచ్చే నెలలో ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలుకాగా.. నేటి వరకు 2.50 లక్షల మందికి పైగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వెల్లడించింది. కేదార్ నాథ్ దర్శించుకునేందుకు 1.39 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.14 లక్షల మంది భక్తులు బద్రీనాథ్ సందర్శనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపింది.

ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో రికార్డు సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది. యాత్రికులకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత యాత్ర జరగడంతో కిందటేడాది రికార్డు స్థాయిలో 47 లక్షల మందికి పైగా బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను దర్శించుకున్నారని వెల్లడించింది.

యాత్ర ఎప్పుడు మొదలుకానుందంటే..
గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 22న తెరుచుకుంటాయి. కేదార్ నాథ్ గుడి ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుచుకుంటాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది.

రిజిస్ట్రేషన్..
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు. యాత్ర అని టైప్ చేసి 91 8394833833 నెంబర్ కు వాట్సాప్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.

More Telugu News