Venkaiah Naidu: ఆస్కార్ రావడంపై వెంకయ్యనాయుడు, కేసీఆర్, జగన్, చంద్రబాబు స్పందన

Venkaiah Naidu Jagan Chandrababu response on Natu Natu Oscar
  • తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్నిచ్చిందన్న వెంకయ్య
  • తెలుగు జెండా ఎగురుతోందన్న జగన్
  • 'నాటునాటు' పాట చరిత్రలో నిలిచి పోయిందన్న చంద్రబాబు
సినీ ప్రపంచంలో తెలుగుజెండా రెపరెపలాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటునాటు' పాట కైవసం చేసుకుని తెలుగోడి సత్తా నలుదిశలా చాటింది. 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఈ ఘన విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. 

రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ ల ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్ని ఇవ్వడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు అన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు గీతం ఆస్కార్ అందుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

'నాటునాటు'కు ఆస్కార్ రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని కొనియాడారు. మన పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారికి గర్వకారణమని చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ఈ పాట అద్దం పట్టిందని అన్నారు. ఈ పాట తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనమని చెప్పారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... తెలుగుజెండా ఎగురుతోందని అన్నారు. మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు. వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను కైవసం చేసుకోవడం ద్వారా 'నాటునాటు' పాట చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని... ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లకు అభినందనలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
Venkaiah Naidu
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
RRR
Natu Natu
Oscar
Tollywood

More Telugu News