Dhulipala Narendra Kumar: వైసీపీ ఎంపీ సవాల్ ను లోకేశ్ ఎప్పుడో స్వీకరించారు: ధూళిపాళ్ల

  • చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు మిథున్ రెడ్డి సవాల్
  • లోకేశ్ అందుకు సిద్ధమేనని ప్రకటించారని ధూళిపాళ్ల వెల్లడి
  • ఎన్నికల కోడ్ వల్ల లోకేశ్ జిల్లాలో లేరని వివరణ
  • లోకేశ్ జిల్లాలో లేని సమయంలో చర్చకు పిలుస్తున్నారని విమర్శలు
Dhulipalla Narendra press meet about YCP MP Mithun Reddy challenge

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా అభివృద్దిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ ను లోకేశ్ ఎప్పుడో స్వీకరించారని స్పష్టం చేశారు. చర్చకు సిద్ధమని లోకేశ్ ప్రకటించారని వెల్లడించారు. 

"నిన్నటి వరకు చర్చకు రాని మిథున్ రెడ్డి ఎన్నికల కోడ్ ని దృష్టిలో పెట్టుకొని లోకేశ్ రారని తెలిసి ఇప్పుడు పిలవడంలో అర్థంలేదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి జిల్లా నుంచి లోకేశ్ ను బయటికి పంపిన తరువాత చర్చకు రమ్మని పిలవడం వారి పిరికితనానికి నిదర్శనం. చర్చకు పిలిచిన రోజు రాకుండా మరుసటి రోజు కూడా ఇంట్లో దాక్కొని గత రెండు రోజులుగా లోకేశ్ చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లిలో తిరుగుతుంటే చర్చకు రాలేదు. 

లోకేశ్ జిల్లాలో ఉన్నన్ని రోజులు చర్చకు రాకుండా ఇంట్లో దాక్కొని ఇవాళ ఉన్నపళంగా ఎన్నికల కోడ్ సందర్భంగా చర్చకు రమ్మంటున్నారు. లోకేశ్ ను ఎన్నికల నిబంధనల మేరకు జిల్లా అధికారులు మీరు జిల్లాలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి పంపించేసి ఇవాళ చర్చకు రమ్మనడాన్ని బట్టి చూస్తే మిథున్ రెడ్డి ఎంత పిరికిపందలాగా వ్యవహరిస్తున్నాడో అర్థమౌతోంది. 

గతంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసినప్పుడు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినా వేమూరు నియోజకవర్గంలోనే ఉన్నారు. కాని నేడు ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల కోడ్ పేరుతో లోకేశ్ ను జిల్లా నుంచి బయటికి పంపిన తరువాత చర్చకు పిలవడం హాస్యాస్పదం. 

ఈ జిల్లాలో అభివృద్ధి ఏమీ లేదు... అంతా అవినీతే అని లోకేశ్ బహిరంగంగా చెప్పారు. అధికారాన్ని, బలాన్ని ఉపయోగించి దుకాణాలు మూయించినప్పటికీ ప్రజలు లోకేశ్ పర్యటనకు బ్రహ్మరథం పట్టారు. అవినీతి సామ్రాజ్యం, భూ దందాలు, దోపీడీలు ఎలా జరిగాయో, కొండలు ఎలా కరిగిపోయాయో సవివరంగా ప్రజలు లోకేశ్ దృష్టికి తెచ్చారు. జిల్లా మొదలైన దగ్గర నుంచి జిల్లా దాటే వరకు ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో ఒకసారి గుర్తుంచుకోవాలి. లోకేశ్ తిరిగి వచ్చాక ఎప్పుడైనా చర్చకు సిద్ధం. మీలాగా పిల్లిలాగా దాక్కోవడం లోకేశ్ కు అలవాటులేదు" అని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు.

More Telugu News