MLA Rajaiah: సర్పంచి నవ్య ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య

  • ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపుల ఆరోపణలు
  • నవ్య దంపతులతో కలిసి మీడియా ముందుకు వచ్చిన రాజయ్య
  • చెడును తాను ఖండిస్తానన్న నవ్య
  • రాజయ్య వల్లే సర్పంచినయ్యానని వెల్లడి
  • జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానన్న రాజయ్య
MLA Rajaiah apologizes Sarpanch Navya

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి కె.నవ్య సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే రాజయ్య సర్పంచి నవ్య ఇంటికి వెళ్లారు. నవ్య దంపతులకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది. అనంతరం నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య మీడియా ముందుకు వచ్చారు.

సర్పంచి నవ్య మీడియాతో మాట్లాడుతూ, చెడును తాను ఖండిస్తానని తెలిపారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచిని కాగలిగానని అన్నారు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండరాదని కోరుకుంటానని తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని పేర్కొన్నారు. 

పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమని నవ్య వ్యాఖ్యానించారు. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా సిద్ధమేనని హెచ్చరించారు. 

ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ, తెలిసీ తెలియక తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశం, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తమకు పలు సూచనలు చేసిందని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపిందని చెప్పారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని అన్నారు.

తాను ఏ గ్రామం పట్ల వివక్ష ప్రదర్శించలేదని, జానకీపురం గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని రాజయ్య హామీ ఇచ్చారు. జానకీపురం గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు.

More Telugu News