Rajinikanth: రాజకీయాలకు ఎందుకు దూరమైందీ బయటపెట్టిన రజనీకాంత్

  • అప్పట్లో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్
  • ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిన వైనం
  • మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన సూపర్ స్టార్
  • తాను కూడా రాజకీయాల్లోకి రావొద్దనే చెప్పానన్న వెంకయ్యనాయుడు
Rajinikanth Revealed Why He Far Away From Politics

రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నిర్ణయం అభిమానులను నిరాశ పరిచింది. ఆ నిర్ణయం నుంచి తాను యూటర్న్ ఎందుకు తీసుకున్నానన్న విషయాన్ని రజనీకాంత్ తాజాగా వెల్లడించారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో గతరాత్రి జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రజనీకాంత్ అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు చెప్పారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు. అయితే, రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు. ఎక్కువ కార్యక్రమాలతో బిజీగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.

తాను కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. తాను ఈ విషయాలు చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పిన రజనీకాంత్.. లేడు అనే వారు కనీసం ఒక్క రక్తపు బొట్టునైనా తయారు చేసి చూపించాలని సవాలు చేశారు. 

వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావొద్దని తాను కూడా రజనీకాంత్‌కు హితవు పలికానన్నారు. అయితే, ఆ సమయంలో తనను అపార్థం చేసుకున్నారన్నారు. యువత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.

More Telugu News