Hyderabad: కట్నం సరిపోలేదట.. ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకున్న వధువు!

Bride Cancel Marriage for enough dowry in Ghatkesar
  • హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో ఘటన
  • వధువుకు రూ. 2 లక్షల కట్నం ఇచ్చిన వరుడి కుటుంబ సభ్యులు
  • అదనపు కట్నం కావాలని వధువు డిమాండ్
  • పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం
  • ఇచ్చిన రూ. 2 లక్షలూ వదిలేసుకున్న వైనం
మీరు చదివింది నిజమే! కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో గతరాత్రి జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోచారం మునిసిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అమ్మాయికి రూ. 2 లక్షల కట్నం ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. గత రాత్రి 7.21 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వివాహ ఏర్పాట్లు కూడా జరిగాయి.

పెళ్లి కోసం వరుడి తరపు కుటుంబ సభ్యులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. అయితే, ముహూర్తానికి సమయం మించిపోతున్నా వధువు తరపు వారి జాడ లేకపోవడంతో అనుమానించిన వరుడి తరపు బంధువులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసి షాకయ్యారు. తనకు రూ. 2 లక్షల కట్నం సరిపోదని, అదనంగా మరింత ఇస్తేనే వివాహం జరుగుతుందని వధువు తేల్చి చెప్పింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు.

పెళ్లికి సరిగ్గా గంట ముందు ఆమె ఈ విషయం చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత తేరుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు యువతి తరపు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. వధువుకు కట్నంగా ఇచ్చిన రూ. 2 లక్షలను కూడా వరుడి కుటుంబం వదులుకోవడం కొసమెరుపు.
Hyderabad
Ghatkesar
Marriage

More Telugu News