Avinash Reddy: దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ జరుపుతోంది: అవినాశ్ రెడ్డి

Avinash Reddy talks about CBI probe in Viveka murder case
  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
  • తనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవన్న అవినాశ్ 
  • తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడి
  • విచారణ అధికారి పక్షపాత ధోరణి కనబర్చుతున్నారని ఆరోపణ
వివేకా హత్య కేసు నేపథ్యంలో, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇవాళ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని తెలిపారు. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని అవినాశ్ రెడ్డి విమర్శించారు. 

తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ, ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాత ధోరణితో కూడుకుని ఉందని ఆరోపించారు. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకుని, అదే కోణంలో విచారణ జరుపుతున్నారని అవినాశ్ రెడ్డి విమర్శించారు. 

తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణ అధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని వెల్లడించారు.
Avinash Reddy
CBI
YS Vivekananda Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News