UK: అక్రమ వలసల నిరోధానికి కొత్త చట్టం.. బ్రిటన్ ప్రధానిపై తీవ్ర విమర్శలు
- అక్రమవలసదారులను దేశం నుంచి పంపించేలా బ్రిటన్ కొత్త చట్టం
- ఈ బిల్లు అక్రమ వలసలను నిరోధిస్తుందన్న బ్రిటన్ ప్రధాని రిషి
- బిల్లులో వలసలదారుల హక్కులకు దక్కని ప్రాధాన్యం
- బ్రిటన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు
బ్రిటన్‌లోకి అక్రమంగా వలసొచ్చిన వారిని సొంత దేశాలకు తిరిగి పంపించేందుకు ఉద్దేశించిన ఓ ముసాయిదా బిల్లు ప్రస్తుతం బ్రిటన్‌లో వివాదాస్పదంగా మారింది. వలసదారులు తమ వాదన వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వని బిల్లును రూపొందించారంటూ బ్రిటన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రతిపాదిక బిల్లు ప్రకారం.. బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తమ సొంత దేశాలకు లేదా రువాండా లాంటి సురక్షితమైన మూడో దేశానికి తరలిస్తారు. అక్కడి నుంచే వలసదారులు బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలి. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్టు రుజువైతే జీవితకాల నిషేధం విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. వలసదారుల మానవ హక్కులకూ ఈ బిల్లులో ప్రాధాన్యం దక్కలేదు. బ్రిటన్ నుంచి తరలించే క్రమంలో బాధితులకు తమ వాదన వినిపించే అవకాశం ఉండదు. ఈ బిల్లుకు కన్సర్వేటివ్ ఎంపీల మద్దతు లభించగా మానవహక్కుల సంస్థలు, కార్యకర్తలు మాత్రం బ్రిటన్ ప్రభుత్వ చర్యను ఖండించారు. ఇది ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
అయితే..రిషి సునాక్ మాత్రం తన ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. ఈ బిల్లు అంత అసాధారణమైనదేమీ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగానే బిల్లును రూపొందించామని స్పష్టం చేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే అక్రమ వలసదారులు దేశంలోకి కాలుపెట్టేందుకు జంకుతారని పేర్కొన్నారు.