సమంత రాకతో ‘ఖుషీ’ సినిమా సెట్లో సంబరాలు
- కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన చిత్ర బృందం
- మహిళా దినోత్సవం సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు
- పరిశ్రమలోకి వచ్చి 13 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
సరిగ్గా మహిళా దినోత్సవం రోజున బుధవారం ఇది చోటు చేసుకుంది. మహిళా దినోత్సవంతోపాటు, సమంత పరిశ్రమలోకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండతోపాటు, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆద్యంతం సమంత హుషారుగా కనిపించింది.
కొన్ని నెలల క్రితం తాను మయోసైటిస్ అనే వ్యాధికి లోనైనట్టు సమంత ప్రకటించడం తెలిసిందే. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. శరీరమంతా కండరాల నొప్పులు వేధిస్తుంటాయి. దీంతో ఆమె నటనకు విరామం తీసుకుంది. ఫలితంగా ఖుషీ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. చికిత్సతో సమంతా పూర్తిగా కోలుకుంది. జిమ్ లో వర్కవుట్ వీడియోలు కూడా విడుదల చేస్తుండడం తెలిసిందే.