Gujarat Coast: గుజరాత్ తీరంలో డ్రగ్స్ కలకలం.. రూ.425 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత!

  • సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం
  • జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీఎస్ పోలీసులు
  • ఓఖా పోర్టుకు 340 కిలోమీటర్ల దూరంలో ఇరానియ‌న్ బోటు పట్టివేత
  • 61 కిలోల హెరాయిన్ స్వాధీనం.. ఐదుగురి అరెస్టు
Drugs Worth 425 Crore Seized From Iranian Boat Off Gujarat Coast

గుజరాత్ సముద్ర తీరంలో అలజడి రేగింది. భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడి కలకలం రేపింది. మన దేశంలోకి తరలించేందుకు అక్రమంగా తీసుకొచ్చిన 60కి పైగా కిలోల హెరాయిన్ ను ఇండియ‌న్ కోస్టు గార్డు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుజ‌రాత్ లో సముద్రంలో సంచ‌రిస్తున్న ఓ ఇరానియ‌న్ బోటును ఇండియ‌న్ కోస్టు గార్డు, గుజ‌రాత్ ఏటీఎస్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. పడవలో ఉన్న ఐదుగురు ఇరానీ దేశస్థులను అరెస్టు చేసి, 61 కిలోల డ్ర‌గ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ సుమారు రూ.425 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

సోమ‌వారం రాత్రి ఈ ఆప‌రేష‌న్ జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. సముద్ర మార్గం ద్వారా భారీగా నార్కోటిక్స్ స్మ‌గ్లింగ్‌ జ‌రుగుతున్నట్లు వ‌చ్చిన ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా.. ఈ దాడి చేశామ‌ని యాంటీ టెర్ర‌రిస్టు స్క్వాడ్ పోలీసులు వెల్ల‌డించారు.

‘‘రాత్రి సమయంలో రెండు పడవలతో అరేబియా సముద్రంలో పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది పెట్రోలింగ్ చేపట్టారు. ఆ సమయంలో ఓఖా పోర్టుకు 340 కిలోమీటర్ల దూరంలో ఓ ఇరానియ‌న్ బోటు సంచ‌రిస్తున్న‌ట్లు గుర్తించారు. ఆ బోటు క‌దలిక‌ల‌పై అనుమానం రావ‌డంతో.. కోస్ట్ గార్డు సిబ్బంది దాన్ని వెంబ‌డించారు. పారిపోయేందుకు దుండగులు ప్రయత్నించగా.. వెంటాడి వారిని పట్టుకున్నారు. బోటును ఓఖా పోర్టుకు తీసుకువ‌చ్చారు’’ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (రక్షణ విభాగం) ఓ ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News