వెయ్యి కేజీల ఉపగ్రహాన్ని కూల్చేయనున్న ఇస్రో.. ఎందుకంటే..!
- మేఘా ట్రాపికే-1 శాటిలైట్‌ను కూల్చేయనున్న ఇస్రో
- ఉపగ్రహం జీవితకాలం ముగియడంతో కూల్చివేతకు నిర్ణయం
- యూఎన్ఐఏడీసీ నిబంధనలకు అనుగుణంగా శాటిలైట్ కూల్చివేత
మేఘా ట్రాపికే-1 కూల్చేవేతకు ఇస్రో గతేడాది ఆగస్టులోనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా శాటిలైట్‌ను తక్కువ ఎత్తులోని కక్ష్యల్లోకి దింపుతూ వస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 18 సార్లు ఉపగ్రహ గమనాన్ని ఇస్రో మార్చింది. నేడు ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించి ఆ తరువాత మండి బూడిదైపోతుంది. ఎటువంటి ప్రమాదం లేని ప్రాంతం గుండా శాటిలైట్‌ను భూవాతావరణంలోకి ప్రవేశించేలా ఇస్రో చర్యలు తీసుకుంది. శాటిలైట్‌లో ఇప్పటికీ 125 కేజీల ఇధనం ఉందని తెలిపింది. నియంత్రిత విధానంలో ఉపగ్రహ గమనాన్ని మార్చేందుకు ఈ ఇంధనం సరిపోతుందని పేర్కొంది. ఉపగ్రహంలో ఇంకా ఇంధనం మిగిలుండటం కూడా కూల్చివేతకు ఓ కారణమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. శాటిలైట్‌లో ఇంధనం మిగిలుంటే ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.