Alzheimers disease: 19 ఏళ్లకే అల్జీమర్స్ వ్యాధి బారిన పడిన చైనీయుడు

  • మెదడులో అల్జీమర్స్, డిమెన్షియా సంకేతాలు
  • ఎంఆర్ఐ స్కాన్లలో గుర్తించిన వైద్యులు
  • చిన్న వయసులో రావడంపై అయోమయం
  • జన్యుపరంగా కనిపించని రిస్క్ కారణాలు
19year old is the youngest to be diagnosed with Alzheimers disease

వైద్య రంగానికి ఇప్పుడు ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. సాధారణంగా అల్జీమర్స్ వ్యాధి వృద్ధాప్యంలోనే వస్తుంది. వయసులో ఉన్న వారికి వచ్చినట్టు దాఖలాలు లేవు. కానీ, మొదటిసారి చైనాకు చెందిన 19 ఏళ్ల బాలుడిలో అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను వైద్యులు నిర్ధారించారు. దీన్ని చాలా అసాధారణ కేసుగా పరిగణిస్తున్నారు. బ్రిటన్ కు చెందిన ఎన్ హెచ్ఎస్ డేటా ప్రకారం అల్జీమర్స్, ఇదే మాదిరి ఉండే డిమెన్షియా ప్రతి 14 మందిలో ఒకరికి, అది కూడా 65 ఏళ్ల తర్వాత వస్తుంటాయి. 80 ఏళ్లు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ సమస్య ఎదురవుతుంది. 

చైనాకు చెందిన సదరు 19 ఏళ్ల బాలుడు తాను చదువులపై ధ్యాస పెట్టలేకపోతున్నానని, తనకు ఏవీ గుర్తు ఉండడం లేదని చెబుతున్నాడు. స్వల్పకాల జ్ఞాపకాలు కూడా ఉండడం లేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. తిన్నది, హోంవర్క్ చేసింది కూడా గుర్తుండడం లేదు. దీంతో స్కూల్ మాన్పించారు. వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.

పరీక్షల్లో ఏం తేలింది?
వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ తీసి చూశారు. అల్జీమర్స్ ఉన్న వారిలో న్యూరాన్ల వెలుపల బీటా అమిలాయిడ్ అనే ప్రొటీన్ పెద్ద పరిమాణంలో ఉండాలి. అలాగే టీఏయూ టాంగిల్స్ అనేవి యాక్సాన్స్ లోపల వైపు ఉండాలీ. కానీ, చైనా బాలుడిలో ఇవి కనిపించలేదు. సెరబ్రో స్పైనల్ లిక్విడ్ లో పీ-టీఏయూ181 ప్రొటీన్ ను గుర్తించారు. నిజానికి టీఏయూ టాంగిల్స్ ఏర్పడడానికి ముందు ఈ ప్రొటీన్ కనిపిస్తుంది. అంతేకాదు డిమెన్షియాకు సంకేతంగా మెదడులోని హిప్పోకాంపస్ కుచించుకుపోయినట్టు గుర్తించారు.

కారణాలు..?
ఎందుకు ఈ బాలుడిలో ముందుగానే అల్జీమర్స్, డిమెన్షియా సంకేతాలు వచ్చాయనే దానికి వైద్యులు కారణాలను గుర్తించలేకపోయారు. జన్యు పరమైన కారణాలు ఉన్నాయేమో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. బాలుడి కుటుంబ చరిత్రలో ఎవరికీ అల్జీమర్స్ లేదని తెలిసింది. అంతేకాదు ఆ బాలుడిలో ఇతరత్రా ఎలాంటి అనారోగ్య సమస్యలు గుర్తించలేదు. దీంతో అతడి కేసు వైద్యులకు సవాలుగా మారింది.

More Telugu News