Bihar: విడాకులివ్వాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్.. కిడ్నీ అమ్మేస్తున్నానంటూ బ్యానర్‌తో తిరుగుతున్న భర్త!

Bihar man roaming Faridabad streets with kidney for sale banner
  • విడాకుల కోసం రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన భార్య, అత్తమామలు
  • పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం
  • ఈ నెల 21లోగా కిడ్నీ అమ్ముడుకాకపోతే ఆత్మాహుతి చేసుకుంటానన్న భర్త
  • 21న జరిగే ఆత్మాహుతి కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్రపతి, ప్రధాని, నితీశ్‌కు ఆహ్వానం
కొన్ని ఘటనలు వినడానికి విచిత్రంగా ఉంటాయి. కానీ వాటి వెనక తీరని ఆవేదన ఉంటుంది. హార్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ‘నా మూత్ర పిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది’. ‘మార్చి 21న నా ఆత్మాహుతి కార్యక్రమం’ అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫొటోలతో కూడిన ఓ బ్యానర్‌తో తిరుగుతున్నాడో వ్యక్తి. రోడ్డుపై బ్యానర్‌తో అతడిని చూసిన కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.

ఆ వ్యక్తి బ్యానర్‌ను పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడన్న విషయం తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. కొన్నాళ్లపాటు కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. భార్య, బావమరిది, అత్తమామల నుంచి సంజీవ్‌కు వేధింపులు మొదలయ్యాయి. దీంతో విడాకులు తీసుకోవాలని అతడు భావించాడు.

ఇక్కడే మరో సమస్య వచ్చి పడింది. విడాకులు కావాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాల్సిందేనని భార్య, అత్తమామలు పట్టుబట్టారు. ఏం చేయాలో తెలియని సంజీవ్ పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. ఇక ఏ దారీ కనిపించకపోవడంతో ఇదిగో ఇలా బ్యానర్ పట్టుకుని తిరుగుతున్నాడు. 

ఈ నెల 21లోగా కిడ్నీ అమ్ముడుపోతే ఆ సొమ్మును తన భార్యకు ఇచ్చి విడాకులు తీసుకుంటానని, లేదంటే అదే రోజు పాట్నాలో ఆత్మాహుతి చేసుకుంటానని పేర్కొన్నాడు. అంతేకాదు, ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తూ బ్యానర్‌పై వారి పేర్లను ముద్రించాడు. బ్యానర్ రెండోవైపు భార్య, బావమరిది, వారి బంధువుల ఫొటోలను ముద్రించాడు.
Bihar
Faridabad
Kidney
Narendra Modi
Droupadi Murmu
Nitish Kumar
Haryana

More Telugu News