Amaravati: ప్రపంచ టాప్-6 భవిష్యత్ నగరాల జాబితాలో అమరావతి: చంద్రబాబు

  • ఆర్చిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ కథనంపై చంద్రబాబు స్పందన
  • హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • అమరావతి భారత్ ను గర్వించేలా చేస్తుందని ధీమా
  • అమరావతి గురించి గొప్పగా పేర్కొన్న ఆర్కిటెక్చరల్ డిజైన్
Amaravathi gets place in world most futuristic cities by Architectural Digest

నిర్మాణంలో ఉన్న ప్రపంచస్థాయి నగరాలతో ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ఓ జాబితా రూపొందించింది. ఈ టాప్-6 భవిష్యత్ నగరాల జాబితాలో ఏపీ రాజధాని అమరావతికి కూడా స్థానం లభించింది. 

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ఎంపిక చేసిన భావి నగరాల జాబితాలో అమరావతి కూడా ఉందని తెలిపారు. 

స్థిరంగా అభివృద్ధి చెందే ఒక ఆధునిక నగరాన్ని ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో అమరావతి నిర్మాణం చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నగరం ప్రపంచ వేదికపై భారత్ ను గర్వించేలా చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు పత్రికా కథనాన్ని కూడా చంద్రబాబు పంచుకున్నారు. 

ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ వెల్లడించింది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదని, కానీ భవిష్యత్ లో రూపుదిద్దుకునే కొత్త నగరాలు ఎలా ఉండాలన్నదానిపై గొప్ప దార్శనికతను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. 

అమరావతి ప్లాన్ ను పరిశీలిస్తే.... ఒక ప్రభుత్వ భవన సముదాయం నగరానికి వెన్నెముకలా ఉంటుందని, భారతదేశ రాజధాని హస్తినలోని లుట్యెయన్స్ ఢిల్లీ, న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ తరహాలో అమరావతి నగరం మధ్యన భారీ పచ్చదనం కనువిందు చేసేలా డిజైన్ చేశారని వివరించింది. అంతేకాదు, పర్యావరణ పరంగా ఏమాత్రం రాజీపడని విధంగా నగరంలో 60 శాతం పచ్చదనం కానీ, నీరు కానీ ఉండేలా ప్రణాళిక రూపొందించారని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పేర్కొంది. 

అమరావతి గనుక రూపుదిద్దుకుని ఉంటే ప్రపంచ మహానగరాల్లో ఒకటిగా సుస్థిర స్థానం పొందేదని స్పష్టం చేసింది. వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాలు, ఫొటోవోల్టాయిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటర్ ట్యాక్సీలు, సైకిల్ తొక్కేవారికోసం ప్రత్యేక మార్గాలతో అమరావతి ఒక విలక్షణ నగరం అయ్యేదని అభిప్రాయపడింది.

ఆర్చిటెక్చరల్ డైజెస్ట్ పేర్కొన్న టాప్-6 నగరాలు ఇవే...


1. స్మార్ట్ ఫారెస్ట్ సిటీ- మెక్సికో
2. టెలోసా- అమెరికా
3. ద లైన్ సిటీ- సౌదీ అరేబియా
4. ఓషియానిక్స్ బుసాన్- దక్షిణ కొరియా
5. చెంగ్డు స్కై వ్యాలీ- చైనా
6. అమరావతి- భారత్

More Telugu News