Nara Lokesh: ​​సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన లోకేశ్​

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముగిసిన యువగళం
  • తిరుపతి నియోజకవర్గంలో ప్రవేశించిన వైనం
  • రేణిగుంట జోహో ఐటీ కంపెనీ వద్ద లోకేశ్ సెల్ఫీ
  • తాను తెచ్చిన కంపెనీ అని వెల్లడి
Lokesh throws selfie challenge to CM Jagan

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుదీర్ఘంగా కొనసాగి 25వ రోజు గురువారం సాయంత్రం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఉదయం పాదయాత్రకు బయలుదేరే ముందు లోకేశ్ టీడీపీకి చెందిన కేంద్ర మాజీమంత్రి, బీసీ నేత కింజరాపు యర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

25వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కాగా, రేణిగుంట జోహో ఐటీ కంపెనీ ఎదుట యువనేత లోకేశ్ ఉద్యోగులతో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తంచేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "జగన్ మోహన్ రెడ్డీ ఇదిగో నేను రేణిగుంటకు తెచ్చిన జోహో ఐటీ కంపెనీ... జోహో కంపెనీ లో పనిచేస్తున్న నా చెల్లెమ్మల కళ్ళలో ఆనందం చూడు జగన్ రెడ్డి. ఇక్కడ వంద మంది యువతీ, యువకులు పని చేస్తున్నారు. నీ హయాంలో ఒక్క కంపెనీ వచ్చిందా? ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేసి, ఉద్యోగాలు లేకుండా చేసే జగన్ రెడ్డికి ఉద్యోగం వస్తే యువతీ, యువకులు పడే ఆనందం గురించి తెలియాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. నా సెల్ఫీ ఛాలెంజ్ కొనసాగుతుంది. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీల ముందు నేను సెల్ఫీ దిగుతాను. జగన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ కంపెనీలు తప్ప ఏమైనా ఉంటే సెల్ఫీ దిగి పోస్ట్ చెయ్యాలి" అంటూ సవాల్ విసిరారు. 

ఇక, నీలిసానిపేటలో లోకేశ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ నిల్చున్న స్టూల్‍ను పోలీసులు లాక్కెళ్లారు. పోలీసుల తీరుపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పాదయాత్రను అడ్డుకోవాలని ఏ నిబంధనలు చెబుతున్నాయంటూ స్థానిక ఎస్ఐని నిలదీశారు. 

గాజులమాండ్యంలో టీడీపీ ఫ్లెక్సీలు, తోరణాలు కొందరు రెవిన్యూ అధికారులు తొలగిస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ సాకుతో బ్యానర్లను తొలగించడంపై పార్టీ కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము కేవలం యువగళం జెండాలు, ఫ్లెక్సీలను మాత్రమే పెడుతున్నామని, ఎక్కడా కనీసం పార్టీ జెండాలను కూడా ప్రదర్శించపోయినా తొలగించడం అక్రమమని కార్యకర్తలు పేర్కొన్నారు. 

కాగా, తిరుపతి శివార్లలో యువనేతకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలనుంచి అపూర్వస్వాగతం లభించింది. అడుగడుగునా మేళతాళాలు, డప్పుల చప్పుళ్లు, బాణాసంచా మోతలతో యువతీయువకులు కేరింతలు కొడుతూ యువనేతకు నీరాజనాలు పలికారు.

మందులు కొనలేని స్థితిలో జగన్ ప్రభుత్వం!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక కొనుక్కొచ్చుకోవాలని చెప్పే దుస్థితి ని జగన్ రెడ్డి తెచ్చారని లోకేశ్ విమర్శించారు. ఆర్ఎంపీలతో భేటీ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... "టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎంపీల సమస్యలపై జీఓ 429/1 లేదా 429/2 తీసుకురావాల్సిన బాధ్యత మాపై ఉంది. మీకు అక్రిడేషన్లు ఇచ్చి మీ సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీరు సభ్యులుగా ఉండాలని కోరారు. దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్.ఎం.పీల గుర్తింపుకోసం ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాన్ని ఏర్పాటు చేస్తాం" అని పేర్కొన్నారు.

యాదవులకు దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చాక యాదవులకు జనాభా దామాషా ప్రకారం వారికి న్యాయం రావాల్సిన నిధులు కేటాయిస్తామని, నామినేటెడ్ పోస్టుల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. రేణిగుంట వై కన్వెన్షన్ హాలులో యాదవులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... "పాలిచ్చే ఆవుని వద్దనుకొని... ప్రజలు తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. జగన్ పాలనలో కార్పొరేషన్ ఛైర్మన్లు డమ్మీలుగా మారిపోయారు. వైసీపీ పాలనలో యాదవుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది సున్నా.

యాదవులను అన్నివిధాలా ఆదుకుంటాం!

యాదవుల్లో పేదరికం ఉందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవులను అన్ని విధాలా ఆదుకుంటామని లోకేశ్ చెప్పారు. "యాదవులను పారిశ్రామికవేత్తలగా తీర్చిదిద్దుతాం. గొర్రెలు, మేకల కొనుగోలుకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సహాయం అందిస్తాం. గొర్రెల కాపరులు చనిపోతే ఇన్స్యూరెన్స్ అందిస్తాం. యాదవ భవనాల నిర్మాణం కోసం సహాయం చేస్తాం. నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి యాదవ సామాజికవర్గం యువకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం" అని హామీలు ఇచ్చారు.

నిబంధనలు జగన్ కు వర్తించవా?

జగన్ జీవో నెం.1 తో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. జగన్ బహిరంగ సభలు అన్ని రోడ్ల మీదే పెట్టాడని, జగన్ పాదయాత్రలో 9 మంది చనిపోయారని వెల్లడించారు. "అప్పుడు లేని నిభందనలు ఇప్పుడు నా పాదయాత్ర కి ఎందుకొచ్చాయి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు...రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు...

ఇప్పటి వరకు నడిచిన దూరం 344.6  కి.మీ.
25వరోజు (గురువారం) నడిచిన దూరం 15.5కి.మీ.

యువగళం పాదయాత్ర 26వ రోజు షెడ్యూల్(24-2-2023)

తిరుపతి నియోజకవర్గం
ఉదయం
11.00  – తిరుపతి అంకుర హాస్పటల్ సమీపానగల విడిది కేంద్రంలో ఆటో యూనియన్లతో సమావేశం.
మధ్యాహ్నం 
12.00  – క్యాంప్ సైట్ లో టిటిడి ఉద్యోగులతో భేటీ.
1.00 -  క్యాంప్ సైట్ లో భోజన విరామం.
సాయంత్రం
5.00  – క్యాంప్ సైట్ లో యువతీయువకులతో ముఖాముఖి సమావేశం.
7.00 – అంకుర హాస్పటల్ సమీపాన విడిది కేంద్రంలోనే బస.

More Telugu News