Pattabhi: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్

Two weeks remand for Pattabhi
  • గన్నవరంలో నిన్న తీవ్ర ఉద్రిక్తత
  • టీడీపీ కార్యాలయం ధ్వంసం
  • టీడీపీ నేత పట్టాభి, తదితరుల అరెస్ట్
  • కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
గన్నవరంలో ఘర్షణలపై టీడీపీ నేత పట్టాభిరామ్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. 

పట్టాభి, తదితరులపై గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. పట్టాభి, తదితరులు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని ఫిర్యాదు దాఖలైంది. తనను కులం పేరుతో దూషించారని సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఏ1గా పట్టాభి, ఏ2గా దొంతు చిన్నా, ఇంకా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. 

 ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. పట్టాభి స్పందిస్తూ, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపారు. తోట్లవల్లూరు పీఎస్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడించారు. 

పీఎస్ లో అడుగుపెట్టేసరికి అక్కడంతా చీకటిగా ఉందని తెలిపారు. ముసుగువేసుకుని ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి, తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని పట్టాభి వివరించారు. అరికాళ్లు, అరచేతులపై తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తికి తెలిపారు. 

వాదనలు విన్న అనంతరం పట్టాభి, తదితరులకు రెండు వారాల రిమాండ్ విధించారు. పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
Pattabhi
Remand
Court
TDP
Gannavaram

More Telugu News