Hyderabad: రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో డ్రైవర్ పరార్!

Car Driver Flee with Rs 7 Crore Jewellery
  • హైదరాబాద్‌లోని ఎస్సార్‌ నగర్‌లో ఘటన
  • నగల డెలివరీకి వెళ్లిన సేల్స్‌మన్
  • కారులోని నగలతో పరారైన డ్రైవర్
ఓ కారు డ్రైవర్ రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉండే అనూష రూ. 50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఆర్డర్ చేశారు. నిన్న సాయంత్రం మధురానగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లిన అనూష నగలను అక్కడికే పంపమని చెప్పారు.

దీంతో రాధిక తన కారులో డ్రైవర్ శ్రీనివాస్ (26), సేల్స్‌మెన్ అక్షయ్ (30)లతో ఆ నగలను పంపారు. మధురానగర్ చేరుకున్న తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారులో ఉండగా, అక్షయ్ నగలను తీసుకెళ్లి అనూషకు ఇచ్చి తిరిగి వచ్చి చూస్తే కారు లేదు. 

సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కు ఇవ్వాల్సిన రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులోనే ఉన్నాయి. శ్రీనివాస్ ఆ నగలతో పరారైనట్టు అనుమానించిన అక్షయ్ వెంటనే విషయాన్ని రాధికకు తెలియజేశారు. ఆమె ఎస్సార్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Hyderabad
SR Nagar
Jewellery
Crime News

More Telugu News