Chandrababu: నేను కూడా పారిపోతే మిమ్మల్ని చంపినా దిక్కులేదు: అనపర్తిలో చంద్రబాబు ఫైర్

  • కాలినడకన అనపర్తి చేరుకున్న చంద్రబాబు
  • 7 కిలోమీటర్లు నడిచానని వెల్లడించిన టీడీపీ అధినేత
  • అనపర్తిలో ఉద్రిక్తత నడుమ ప్రసంగం
  • పోలీసులపైనా, సీఎం జగన్ పైనా ఆగ్రహం
Chandrababu fires on CM Jagan and police in Anaparthi

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకనే అనపర్తి చేరుకున్నారు. పలు అడ్డంకులు దాటి అనపర్తిలో అడుగుపెట్టారు. మార్గమధ్యంలో కార్యకర్తలు అందించిన కొబ్బరిబోండాం తాగి సేద దీరారు. చంద్రబాబు బలభద్రపురంలో బయల్దేరే సమయానికి చీకట్లు ముసురుకోగా, ఆయన సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే అనపర్తి వరకు 7 కిలోమీటర్లు నడిచారు. 

ఇక అనపర్తిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపైనా, పోలీసుల పైనా నిప్పులు చెరిగారు. ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితిలో అనపర్తి వచ్చానని అన్నారు. ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు చెబుతున్నా... ఈ అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించాను అని వెల్లడించారు. 

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని, తన రికార్డు ఎవరూ ఛేదించలేరని అన్నారు. "నేనేమైనా పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చానా? నేను ఇక్కడికి వచ్చే హక్కు లేదా? ప్రజల కోసం ఎన్నో అవమానాలు భరించా. నా పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చిన పత్రాలు ఇవిగో. పోలీసులు నా దగ్గర పనిచేసినవారే. జగ్గంపేటకు వెళితే పోలీసులు సహకరించారు, పెద్దాపురం వెళితే పోలీసులు సహకరించారు... కానీ అనపర్తి వద్దామనుకుంటే అడ్డుపడ్డారు. 

ఇక్కడ గ్రావెల్ సూర్యనారాయణ అని ఒకడున్నాడు... ఖబడ్దార్ గ్రావెల్ సూర్యనారాయణ!  నాతో పెట్టుకుంటున్నావు... జాగ్రత్తగా ఉండు! తమాషా అనుకోవద్దు. నేను తమాషా రాజకీయాలు చేయడంలేదు. నేను భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా" అని స్పష్టం చేశారు. 

టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదని హెచ్చరించారు. ఇదే యూనిఫాం వేసుకుని రేపు పోలీసులు నా వద్దే పనిచేయాల్సి ఉంటుంది అని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన పోలీసులను వదిలేది లేదని అన్నారు. నాడు సైకో ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేశాడు... మేం అడ్డుకున్నామా... ఆయన తండ్రి పాదయాత్ర చేసినా మేము అడ్డుకోలేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. 

తానేమీ సీఎం కావాలని కోరుకోవడంలేదని అన్నారు. ప్రజల కోసమే తన పోరాటం అని, భవిష్యత్ తరాల కోసమే తాను పనిచేస్తున్నానని ఉద్ఘాటించారు. నేను కూడా పారిపోతే మిమ్మల్ని చంపినా దిక్కులేదంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఓ దశలో చంద్రబాబు మాట్లాడుతుండగా జనసమూహంలోకి పోలీసులు ప్రవేశించారు. దాంతో చంద్రబాబు మండిపడ్డారు. నా మైక్ వద్దకు ఎవరూ రావొద్దు అంటూ హెచ్చరించారు. మీరు ఇచ్చిన అనుమతి పత్రం ఇదిగో అంటూ పర్మిషన్ ఆర్డర్ ను ప్రదర్శించారు. ఈ దశలో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య చిక్కుకుపోయారు. ఇది గమనించిన చంద్రబాబు... మీ మీదకు పురిగొల్పాలంటే నాకు ఒక్క నిమిషం చాలు... జాగ్రత్తగా ఉండండి... ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. 

ఇక పోలీసులతో జరిగిన తోపులాటలో ఓ టీడీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో, చంద్రబాబు మరింత ఆగ్రహం వెలిబుచ్చారు. పోలీసులు కొట్టడంతో టీడీపీ కార్యకర్తను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని అన్నారు. ఒక సైకో పోలీసులను కూడా సైకోలుగా మార్చేశాడని విమర్శించారు. 

చంద్రబాబు ఈ విషయం చెబుతుండగా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో, అందరూ సెల్ ఫోన్ లైట్లు వెలిగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జనరేటర్ కూడా ఆపేశారని ఆరోపించారు. పోలీసులకు ఒకటే చెబుతున్నా... చట్ట ప్రకారం వ్యవహరించి మిమ్మల్ని కూడా బొక్కలో పెడతానని అన్నారు.

More Telugu News