Tollywood: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ‘కథ వెనుక కథ’ టీజ‌ర్‌ విడుదల చేసిన గోపీచంద్ మలినేని

  • దండమూడి బాక్సాఫీస్ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం 
  • కృష్ణ చైత‌న్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
  • ప్రధాన పాత్రల్లో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ
katha venuka katha teaser lrelease

కొత్త రకం చిత్రాల‌ను అందిస్తూ, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభశ్రీ ప్ర‌ధాన పాత్రల్లో న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్నిఅవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని శుక్రవారం విడుదల చేశారు. టీజ‌ర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాల‌ని ఆకాంక్షించారు. 75 సెకన్ల నిడివితో కూడిన ఈ టీజ‌ర్‌ ఓ యువ దర్శకుడు (విశ్వంత్) మ‌రో పాత్ర‌కు ఓ క్రైమ్ క‌థ‌ను చెప్ప‌టంతో మొదలవుతుంది. సిటీలో చాలా వ‌ర‌కు మిస్సింగ్ కేసులుగా న‌మోదు అవుతున్న అమ్మాయిల‌ను హ‌త్య‌ల‌ను చేస్తున్న హంత‌కుడెవ‌రో పోలీసుల‌కు అంతు చిక్క‌దు.

దీంతో ఈ కేసుని స‌త్య (సునీల్‌) అనే సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కి అప్ప‌గిస్తారు. ఈ విష‌యాన్ని స‌త్య ఎలా క‌నుక్కున్నాడనే అంశాలతో టీజర్ కట్ చేశారు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్ఠాత్మంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి  గంగ‌న‌మోని శేఖ‌ర్‌, ఈశ్వ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్లుగా పని చేస్తున్నారు. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News