Andhra Pradesh: కడప స్టీల్ ప్లాంట్ కు సీఎం జగన్ భూమి పూజ

  • దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న జగన్
  • జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుందని వెల్లడి
  • స్టీల్ ఫ్యాక్టరీతో జిల్లా రూపురేఖలు మారిపోతాయని సీఎం వ్యాఖ్య
SW steel plant bhoomi pooja at ysr kadapa district

వైఎస్సార్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ఈ రోజు (బుధవారం) శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధివైపు నడిపించాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ కలలు కన్నారని చెప్పారు. 

వైఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. ఇంతకాలానికి ఆయన బిడ్డ, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక మళ్లీ ఈ ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. వైఎస్సార్ కలలను సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురునిలిచి, ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని వివరించారు. వచ్చే 24 నుంచి 30 నెలల పీరియడ్ లో ప్లాంట్ తొలిదశ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

ప్లాంట్ మొదలైన తర్వాత అనుబంధ పరిశ్రమలు జిల్లాకు తరలివస్తాయని, జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం జగన్ చెప్పారు. జిల్లాలోని యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రారంభంలో ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం 3 మిలియన్ టన్నులు అని, భవిష్యత్తులో ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రూ.700 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుందని జగన్ తెలిపారు.

More Telugu News