Air Taxi: 2026 నాటికి దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు

Air Taxis will be introduced in Dubai by 2026

  • ఎయిర్ ట్యాక్సీల డిజైన్లకు ఆమోదం తెలిపిన దుబాయ్ ప్రభుత్వం
  • మరో మూడేళ్లలో వెర్టిపోర్టుల నిర్మాణం పూర్తి
  • ఊబర్ రైడ్ తో పోల్చితే చవక ధరలకే విమాన ట్యాక్సీ ప్రయాణం

రోజులు మారుతున్నాయి. రోడ్లపై తిరుగుతున్న ట్యాక్సీలు ఇకపై గాల్లో ప్రయాణించనున్నాయి! చిన్న విమానాలను భవిష్యత్తులో ట్యాక్సీలుగా నడపనున్నారు. ఈ ఎయిర్ ట్యాక్సీల కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఆలోచనల్లో ఉన్నదే. 

2026 నాటికి దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు తీసుకురానున్నారు. ఈ మేరకు దుబాయ్ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ఫ్లైయింగ్ ట్యాక్సీల డిజైన్లకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఎయిర్ ట్యాక్సీలు దిగేందుకు అనువైన వెర్టిపోర్టుల నిర్మాణం మరో మూడేళ్లలో సాకారం కానుందని వెల్లడించారు. 

ఎయిర్ ట్యాక్సీలతో రహదారి ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, ప్రయాణ వ్యవధి కూడా బాగా తగ్గుతుంది. ఈ చిన్న తరహా విమానాల్లో చార్జీలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందనక్కర్లేదు. ఊబర్ రైడ్ తో పోల్చితే కూడా చవకగానే ఉంటాయని దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చీఫ్ అహ్మద్ బెహ్రోజియన్ వెల్లడించారు. ఎయిర్ ట్యాక్సీల రేట్లు అన్ని వర్గాలకు అందుబాటులోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఎయిర్ ట్యాక్సీల ఉత్పాదన పెరిగే కొద్దీ, టెక్నాలజీ వ్యయం కూడా దిగొస్తుందని అభిప్రాయపడ్డారు. 

దుబాయ్ లో ఈ ఎయిర్ ట్యాక్సీలను 240 కిమీ పరిధిలో నడపనున్నారు. వీటి గరిష్ఠ వేగం గంటకు 300 కిమీ. వీటిని యూఏఈలోని ఇతర నగరాల మధ్య కూడా తిప్పుతామని బెహ్రోజియన్ తెలిపారు. దాంతో దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణ వ్యవధి గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు.

More Telugu News