Indian citizenship: గతేడాది ఎంత మంది భారత పౌరసత్వం వదులుకున్నారో తెలుసా..?

Last Year 225620 indians renounced their citizenship says external affairs minister s jaishankar
  • గతేడాది పౌరసత్వం వదులుకున్న 2,25,620 మంది భారతీయులు
  • రాజ్యసభలో మంత్రి జయ్‌శంకర్ వెల్లడి
  • 2011-22 మధ్య 16 లక్షల మందికిపైగా భారత పౌరసత్వం వదులుకున్నారని ప్రకటన

గతేడాది ఏకంగా 2,25,620 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయ్‌శంకర్ తాజాగా రాజ్యసభలో పేర్కొన్నారు. గత పదకొండేళ్ల కాలంలో ఇదే అత్యధికమని తెలిపారు. 2011 నుంచి ఇప్పటివరకూ 16 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వం వదులుకున్నట్టు చెప్పారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు. 2011 నుంచి ఇప్పటివరకూ ఏటా ఎంత మంది తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారన్న వివరాలను ఆయన సభ ముందుంచారు. 

మంత్రి జయ్‌శంకర్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2015లో 1,31,489 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2016లో 1,41,603, 2017లో 1,33,049 పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. ఇక 2018లో 1,34,561, 2019లో 1,44,017, 2020లో 85,256 మంది భారత పౌరసత్వాన్ని త్యజించారు. గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యూఏఈ పౌరసత్వాన్ని స్వీకరించినట్టు మంత్రి జయ్‌శంకర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొత్తం భారతీయ పౌరసత్వం వదులుకున్న వాళ్లు 135 దేశాల పౌరసత్వాన్ని పొందినట్టు తెలిపారు. 

అమెరికాలో కొలువులు పోవడంతో భారతీయులు ఇక్కట్ల పాలవడం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. ‘‘వీరిలో కొందరు హెచ్-1బీ, ఎల్-1వీ వీసాలు కలిగిన వారు ఉన్నారు. ఐటీ ఉద్యోగాలు కోల్పోయి ఇక్కట్లు పడుతున్న వారి అంశాన్నీ కేంద్రం పలుమార్లు అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది’’ అని ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News