Woman: చీకట్లో స్మార్ట్ ఫోన్ ను చూస్తూ కంటి చూపు పోగొట్టుకున్న హైదరాబాద్ మహిళ

Hyderabad woman loses her eye sight after seeing smartphone in dark
  • లైట్లన్నీ ఆపేసి ఫోన్ చూసే అలవాటు
  • కళ్ల ముందు వలయాలు, గీతలు, మెరుపులు
  • వైద్యుడ్ని సంప్రదించిన హైదరాబాదీ బ్యూటీషియన్
  • ఎస్వీఎస్ సిండ్రోమ్ అని నిర్ధారణ
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్లను అత్యధిక సమయం పాటు వాడడం మంచిది కాదని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. హైదరాబాదులో జరిగిన ఈ సంఘటన వింటే అది నిజమే అనిపిస్తుంది. 

చీకట్లో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ ను చూసి ఓ మహిళ తన కంటిచూపును పోగొట్టుకుంది. డాక్టర్ సుధీర్ హైదరాబాదులో న్యూరాలజిస్టుగా పనిచేస్తున్నారు. రాత్రివేళల్లో అధిక సమయం పాటు స్మార్ట్ ఫోన్ ను చూసిన ఓ మహిళ కంటిచూపు కోల్పోయిన వైనాన్ని డాక్టర్ సుధీర్ వెల్లడించారు. 

తన వద్దకు వచ్చిన ఆ రోగి పేరు మంజు అని వెల్లడించారు. కళ్ల ముందు వలయాలు, వంకరటింకర గీతలు, ఉన్నట్టుండి మెరుపులు కనిపిస్తుండడం వంటి లక్షణాలతో ఆమె తన వద్దకు వచ్చిందని వివరించారు. ఒక్కోసారి కళ్లకు ఏమీ కనిపించకపోవడం, దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలతో ఆమె బాధపడేదని తెలిపారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే స్మార్ట్ ఫోర్ విజన్ సిండ్రోమ్ (ఎస్వీఎస్)తో బాధపడుతున్నట్టు వెల్లడైందని వివరించారు. 

ఎస్వీస్ సిండ్రోమ్ తో ఒక్కోసారి కంటిచూపు కూడా పోతుందని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు. మంజు గతంలో బ్యూటీషియన్ గా పనిచేసేదని, సరిగా ఎదగని తన కొడుకును చూసుకునేందుకు ఉద్యోగం మానేసిందని వెల్లడించారు. ఆమె ఇంటి పట్టునే ఉండడంతో స్మార్ట్ ఫోన్ కు బానిసైందని, గంటల కొద్దీ ఫోన్ లో ఏదో ఒకటి చూస్తుండేదని, రాత్రి వేళల్లో లైట్లన్నీ ఆపేసి ఫోన్ చూస్తుండేదని తెలిపారు. 

ఆమె సమస్యను గుర్తించాక, ఫోన్ చూసే సమయం తగ్గించుకోవాలని సలహా ఇచ్చామని, ఇప్పుడామె కంటిచూపు చాలావరకు మెరుగైందని వెల్లడించారు. 18 నెలల్లో ఆమె కంటిచూ సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. 

స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ (ఎస్వీఎస్) తరహాలోనే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (సీవీఎస్) లేదా డిజిటల్ విజన్ సిండ్రోమ్ కూడా పాక్షికంగా కానీ, కొన్నిసార్లు పూర్తిగా కానీ కంటి చూపు పోవడానికి కారణమవుతుందని డాక్టర్ సుధీర్ వివరించారు. మందులు, జీవనశైలిలో మార్పులతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Woman
Smart Phone
Eye Sight
Dark
SVS
Hyderabad

More Telugu News