KA Paul: రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ ఫైర్.. కేసు నమోదు చేయాలని డిమాండ్

KA Paul demands to arrest Revanth Reddy
  • ప్రగతి భవన్ ను పేల్చేయాలన్న రేవంత్ పై కేఏ పాల్ ఫైర్
  • రేవంత్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
  • టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వ్యాఖ్య
ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు రేవంత్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. భూకబ్జాలు చేసి రేవంత్ ఈ స్థాయికి వచ్చారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చరిత్ర రేవంత్ దని చెప్పారు. రేవంత్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం రేవంత్ ఎన్నడూ పోరాడలేదని... కాంగ్రెస్ పార్టీలో ఆయనొక జూనియర్ నేత అని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించి... బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. 

ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై కూడా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి పాత సెక్రటేరియట్ ను కూల్చేశారని... రూ. 610 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించారని... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. కొత్త సచివాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీబీఐకి ఫిర్యాదు చేశానని తెలిపారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పుట్టినరోజునే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి... కేసీఆర్ పుట్టినరోజున దాన్ని ప్రారంభించడం సరికాదని అన్నారు.
KA Paul
Revanth Reddy
Congress
Pragathi Bhavan

More Telugu News