america: అమెరికాలో పోలీసుల దాడిలో యువకుడి మృతి.. వీడియో వైరల్

black man cried out for his mom as uscops brutally thrashed him
  • ర్యాష్ డ్రైవింగ్ చేశాడని నికోలస్ ను పట్టుకున్న పోలీసులు
  • ఏడుస్తున్నా వినిపించుకోకుండా పిడిగుద్దులు
  • మూడు రోజులపాటు చావుబతుకులతో పోరాడి మృతి
  • దాడి చేసిన ఐదుగురు పోలీసులు, చనిపోయిన నికోలస్.. అందరూ నల్లజాతీయులే!
రెండేళ్ల కిందట అమెరికాలో పోలీసుల దాడిలో చనిపోయిన జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఉదంతమే తాజాగా మరొకటి జరిగింది. పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేయడంతో  29 ఏళ్ల నల్లజాతీయుడు చనిపోయాడు. జనవరి 7న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ సిటీలో ర్యాష్ డ్రైవింగ్ చేశాడనే కారణంతో జనవరి 7న పోలీసులు టైర్ నికోలస్ అనే యువకుడిని పట్టుకున్నారు. ముందు మామూలుగానే అరెస్టు చేసినట్లు కనిపించినా తర్వాత అతడిని తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు అరుస్తున్నా, ఏడుస్తున్నా పోలీసులు కనికరించలేదు. మూడు రోజులపాటు చావుబతుకుల మధ్య పోరాడిన నికోలస్ చివరికి జనవరి 10న చనిపోయాడు. 

అయితే నికోలస్ ను పోలీసులు కొట్టిన ఘటనకు సంబంధించి సీసీటీవీ, బాడీ కెమెరాల వీడియోలు తాజాగా బయటకి వచ్చాయి. మూడు వీడియోలను మింఫిస్ పోలీస్ శాఖ రిలీజ్ చేసింది. ఇవి పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయినవే. అందులో ఒక పోలీస్.. నికోలస్ ముఖంపై పిడిగుద్దులు కురిపించగా.. ఇంకొకరు పదేపదే తన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ఇంటికి వెళ్తున్నానని అతడు చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.. ఏడుస్తున్నా పట్టించుకోలేదు. రోడ్డుపై పడేసి తీవ్రంగా కొట్టారు. 

ఈ ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పోలీసుల అనుచిత ప్రవర్తన తనకు కోపం తెప్పించిందన్నారు. నికోలస్ పై పోలీసులు దాడి చేసిన వీడియోలు తాను చూశానని, అవి బాధించాయని చెప్పారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.

మరోవైపు నికోలస్ ను విచక్షణా రహితంగా కొట్టిన ఆఫీసర్లు కూడా నల్లజాతీయులే కావడం గమనార్హం. ఆఫీసర్లు డిమెట్రియస్ హేలీ, డెస్మాండ్ మిల్స్, ఎమ్మిట్ మార్టిన్, జస్టిన్ స్మిత్, టడారియస్ బీన్ ను అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు.
america
USA
black man
George Floyd
Tyre Nichols
Memphis

More Telugu News