నాకు నిద్ర వస్తోంది.. రైడ్ క్యాన్సిల్ చేసుకోండి.. కస్టమర్ కు ఉబెర్ డ్రైవర్ మెసేజ్
- అర్ధరాత్రి క్యాబ్ బుక్ చేసుకున్న మహిళకు ఎదురైన అనుభవం
- డ్రైవర్ నిజాయతీగా కారణం చెప్పడంతో సరేనన్న మహిళ
- ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో సానుకూలంగా స్పందిస్తున్న నెటిజన్లు
బెంగళూరులో ఆషి అనే మహిళ ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంటకు ఉబెర్ యాప్ లో క్యాబ్ బుక్ చేశారు. తొలుత రైడ్ ను అంగీకరించిన ఉబెర్ డ్రైవర్, కాసేపటికి రైడ్ రద్దు చేసుకోవాలంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. తనకు నిద్ర వస్తోందని చెబుతూ రైడ్ క్యాన్సిల్ చేసుకోవాలని కోరాడు. ఆ డ్రైవర్ నిజాయతీగా చెప్పడంతో తాను సరేనంటూ మెసేజ్ చేసి, ఆ రైడ్ ను రద్దు చేసుకున్నానని వివరించారు. ఆషి ఈ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పెట్టారు. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. డ్రైవర్ నిజాయతీని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.