borderline diabetes: మధుమేహం బోర్డర్ లో ఉంటే.. వెనక్కి మళ్లించొచ్చు

  • జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి
  • శారీరక వ్యాయామానికి తప్పక చోటు ఇవ్వాలి
  • కనీసం ఆరు నెలలకోసారి పరీక్ష ద్వారా ముందుగా గుర్తించే అవకాశం
Do not ignore borderline diabetes know symptoms and lifestyle changes to reverse it

మధుమేహం జీవనశైలిలో మార్పుల ఫలితంగా వచ్చే ఆరోగ్య సమస్య. దీన్ని టైప్-2 డయాబెటిస్ గా చెబుతారు. జీవక్రియలకు సంబంధించిన వ్యాధిగానూ చెబుతారు. మధుమేహంలోకి ప్రవేశించినప్పటికీ దాన్ని చక్కటి నియంత్రణలో పెట్టుకోవచ్చు. కొందరు మధుమేహం సమస్యకు బోర్డర్ లో (సమీపంలో/త్వరలో సమస్య బారిన పడే అవకాశం ఉన్నవారు) ఉంటారు. వీరు ముందే మేల్కొంటే మధుమేహం సమస్య బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇది ఎలా తెలుస్తుంది..? 

రక్త పరీక్షలు
హెచ్ బీఏ1సీ అనే పరీక్షను ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయించుకోవడం ద్వారా.. ఆ మూడు నెలల్లో రక్తంలో గ్లూకోజ్ సగటున ఎంత ఉందన్నది తెలుసుకోవచ్చు. అంతేకాదు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ద్వారా కూడా ఈ స్థితిని తెలుసుకోవచ్చు. హెచ్ బీఏ1సీ 5.7లోపు ఉంటే మధుమేహం లేనట్టు. 5.7-6.4 మధ్య ఉంటే మధుమేహం లేనట్టే. కానీ, వీరు మధుమేహం ముందస్తు దశలో ఉన్నట్టుగా పరిగణిస్తారు. అంటే ప్రీ డయాబెటిస్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రీడింగ్ 99 వరకు ఉంటే మధుమేహం లేనట్టు. 100-125 మధ్య ఉంటే ప్రీ డయాబెటిస్ గా పరిగణిస్తారు.

ప్రీ డయాబెటిస్ లో ఉన్నవారు వెంటనే జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యకర జీవన శైలి, ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జన్యుపరమైన, పర్యావరణ పరమైన అంశాలు కూడా మధుమేహానికి కారణమవుతాయి. ఆహారం రూపంలో రక్తంలోకి వచ్చే గ్లూకోజ్ (షుగర్) పరిమాణాన్ని నియంత్రించేది ఇన్సులిన్. దీన్ని పాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. మధుమేహం సమస్యలో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాదు. ఎక్కువ మందిలో ప్రీ డయాబెటిస్ దశలో లక్షణాలు కనిపించకపోవచ్చు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేసుకోవడం మంచి మార్గం. 

లక్షణాలు
ప్రి డయాబెటిస్ నుంచి డయాబెటిస్ లోకి మారుతున్న క్రమంలో లక్షణాలు కనిపించొచ్చు. అప్పుడు స్పందించినా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం, దాహం ఎక్కువ వేస్తుండడం, ఆకలి పెరిగిపోవడం, నీరసంగా ఉండడం, కంటి చూపు తగ్గడం, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, గాయాలు త్వరగా మానకపోవడం మధుమేహం సమస్యను తెలియజేస్తాయి.
 
రిస్క్ వీరికి ఎక్కువ
కుటుంబంలో తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ, అమ్మమ్మలకు మధుమేహం ఉంటే, వారి వారసులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అలాగే, కదలికలు తక్కువగా ఉండే వారికి, శారీరక వ్యాయామం లేని వారు, రాత్రి తగినంత నిద్ర లోపించిన వారు, కార్బోహైడ్రేట్స్ ఆహారం ఎక్కువగా తీసుకునే వారు, జంక్ ఫుడ్, తోపుడు బండ్లపై ఆహారానికి ఎక్కువగా ఇష్టం చూపించే వారికి, స్థూలకాయులకు మధుమేహం రిస్క్ ఉంటుంది. పాంక్రియాటిక్ సమస్యలున్న వారికి కూడా ఇది వస్తుంది. 

మార్పులు..
పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వైట్ రైస్ వంటి కార్బోహైడ్రేట్స్ కాకుండా, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. అన్నంలో కాయగూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక రొట్టె, ఎక్కువ మొత్తంలో కూర, కప్పు నుంచి రెండు కప్పుల రైస్ కు పరిమితం కావాలి. రోజువారీ 30-40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. బరువు పరిమితికి మించి ఉంటే తగ్గించుకోవాలి. వంట నూనెల్లో నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, పీనట్ ఆయిల్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని సైతం మితంగా తీసుకోవాలి.

More Telugu News