WHO: కలుషిత ఔషధాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • తయారీ కేంద్రాల తనిఖీ ప్రమాణాలను పెంచుకోవాలని సూచన
  • నకిలీ, ప్రమాణాల్లేని ఔషధాలను తొలగించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • తగిన అనుమతులతో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచన
immediate action after cough syrup deaths WHO medical alerts issued

కలుషిత ఔషధాలపై ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కొన్ని దేశాల్లో కలుషిత దగ్గు, జలుబు మందు తాగిన చిన్నారులు పదుల సంఖ్యలో మరణించడంతో తాజా హెచ్చరికలు చేసింది. గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాల్లో దగ్గు మందు తాగిన ఐదేళ్లలోపు 300 మంది చిన్నారులు కిడ్నీలు దెబ్బతిని చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గాంబియా, ఉజ్బెకిస్థాన్ లో మరణాలకు భారత్ కు చెందిన ఫార్మా కంపెనీల దగ్గు మందులు కారణమనే ఆరోపణలు రావడం తెలిసిందే.

ఈ దగ్గు మందులో అధిక మోతాదులో డైఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించడం గమనార్హం. ఈ కలుషితాలు ప్రమాదకర రసాయనాలు అని, కొద్ది మోతాదులో తీసుకున్నా ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ‘‘ఇవేమీ అరుదైన సంఘటనలు కాదు. ఔషధ సరఫరా చైన్ లో భాగంగా ఉన్న దేశాలు వెంటనే సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరింది. 

‘‘సభ్య దేశాలు తమ మార్కెట్లలో పంపిణీలో ఉన్న అన్ని ఔషధాలను తనిఖీ చేసి, ప్రమాణాల మేరకు లేని, కలుషిత ఉత్పత్తులను తొలగించాలి. విక్రయించే అన్ని ఉత్పత్తులు కూడా ఆయా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నవి అయి ఉండాలి. తయారీ కేంద్రాల తనిఖీలో ప్రమాణాలు మరింత మెరుగుపరచాలి’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఈ మేరకు మొత్తం మూడు అలర్ట్ లు జారీ చేసింది.

More Telugu News