gym: జిమ్ లో కసరత్తులకు ముందు హార్ట్ స్కాన్ అవసరం అంటున్న వైద్యనిపుణులు

  • కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే జాగ్రత్త పడాలి
  • 30-35 ఏళ్లకే హార్ట్ స్క్రీనింగ్ అవసరం
  • కఠోర వ్యాయామాలకు ముందు హార్ట్ స్కాన్ చేయించుకోవాలి
Thinking of lifting weights in the gym Get a heart scan first

జిమ్ కసరత్తులు చేస్తూ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి విన్నాం. ఇలా మరణించిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందని అంటే? దీని వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. 

సాధారణంగా రోజువారీ వ్యాయామాలు చేయని వారు, బరువులు మోసే అలవాటు లేని వారు.. ఉన్నట్టుండి ఓ మోస్తరు వ్యాయామాలు వరకు చేయవచ్చు. దీని వల్ల పెద్ద రిస్క్ ఉండదు. ఉదాహరణకు నడక, వేగంతో కూడిన నడక, స్విమ్మింగ్ లాంటివి చేసుకోవచ్చు. కానీ, ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలు ఉన్నా, కఠోరమైన వ్యాయామాలు చేయడానికి రంగంలోకి దిగుతున్నా.. ముందుగా వైద్యుల సూచన తీసుకోవడం ఎంతో అవసరం. 

వ్యాయామాలు చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలను గమనిస్తే.. వారిలో అప్పటికే రక్తనాళాల గోడలపై కొవ్వు పేరుకుని, రక్త ప్రసరణ మార్గం కుచించుకుపోయి ఉండొచ్చు. కఠోరమైన వ్యాయామాల సమయంలో రక్తాన్ని మరింత వేగంగా పంపింగ్ చేయాల్సిన శ్రమ గుండెపై పడుతుంది. కానీ, రక్తం సరిపడా అందకపోవడంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. 

వ్యాయామాలు ఏవైనా గుండెపై ఒత్తిడి పడుతుంది. కొంచెం కొంచెంగా శ్రమను పెంచుకుంటూ పోవడం వల్ల అది గుండెకు అలవాటు అవుతుంది. ఉన్నట్టుండి ఒకేసారి భారీ బరువులు ఎత్తడం వల్ల గుండెపై ఒక్కసారిగా భారం పడడంతో అది చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. 

వీరు జాగ్రత్తలు తీసుకోవాలి..
కుటుంబంలో అంతకుముందు తల్లిదండ్రులు, తాతల వైపు ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయా? అని ఒక్కసారి పరిశీలించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే.. 30-35 ఏళ్ల వయసుకే ఒకసారి కరోనరీ క్యాల్షియం స్కాన్ లేదా హార్ట్ స్కాన్ లేదా స్క్రీనింగ్ కు వెళ్లాలన్నది వైద్యుల సూచన. లేదా జిమ్ లో చేరాలనుకునే వారు ముందు ఒక్కసారి గుండె వైద్య నిపుణుడి నుంచి ఆమోదం పొందడం తీసుకోవాలి. 

తీవ్రత అధికంగా ఉండే వ్యాయామాలు, అధిక బరువు ఎత్తేవారు, క్రీడల్లో పాల్గొనే వారు.. ముందు ఈసీజీ, ఎకో, టీఎంటీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె సామర్థ్యం ఈ పరీక్షలతో తెలుస్తుంది. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ టెస్టులు కూడా అవసరం పడతాయి. కరోనరీ క్యాల్షియం స్కాన్ తో ఆర్టరీల్లో కొవ్వులు పేరుకుంటే తెలుస్తుంది.

More Telugu News