Pakistan media: ప్రధాని మోదీని కీర్తించిన పాకిస్థాన్ మీడియా

  • బ్రాండ్ ఇండియాకు మరెవరూ చేయలేని విధంగా మోదీ కృషి
  • విదేశాంగ విధానంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుందన్న విశ్లేషణ
  • సాగు దిగుబడి ప్రపంచంలో మేటిగా పేర్కొన్న ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కాలమ్
Pakistan media praises PM Modi says brought India to a point

భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నో సందర్భాల్లో ప్రశంసించడం గుర్తుండే ఉంటుంది. ప్రధాని పదవిలో ఉన్నప్పుడు, పదవీచ్యుతుడు అయిన తర్వాత కూడా ఆయన బహిరంగ సభల్లో నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా ధైర్యంగా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ పత్రిక ద ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కూడా మోదీ పల్లవి ఎత్తుకుని ఆశ్చర్యపరిచింది. 

ఇతరులను ప్రభావితం చేసే స్థాయికి భారత్ ను నిలబెట్టారని ప్రధాని నరేంద్ర మోదీని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ ఓ కాలమ్ రూపంలో ప్రశంసించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయంగా విస్తరిస్తున్న తీరును కాలమ్ లో ప్రస్తావించింది. ‘‘ప్రధాన మంత్రి మోదీ సారథ్యంలో భారత విదేశాంగ విధానం ఎంతో నైపుణ్యవంతంగా ఉంది. భారత జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది’’ అని పేర్కొంది. దీన్ని చిరస్మరణీయ అభివృద్ధిగా.. రాజకీయ, భద్రత, రక్షణ రంగ విశ్లేషకుడు అయిన షాజాద్ చౌదరి ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కాలమ్ లో పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు భారత్ ప్రాధాన్య పెట్టుబడుల క్షేత్రంగా మారినట్టు చెప్పారు.

విదేశాంగ విధానంలో భారత్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. వ్యవసాయంలో ఎకరా దిగుబడి ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా చౌదరి పేర్కొన్నారు. భారత దేశ పాలనా వ్యవస్థ కాల పరీక్షను తట్టుకుని నిలబడినట్టు చెప్పుకొచ్చారు. దృఢమైన ప్రజాస్వామ్యానికి కావాల్సిన కనీస పునాదులు ఎంత బలంగా ఉన్నాయో నిరూపించుకున్నట్టు తెలిపారు. బ్రాండ్ ఇండియాకు ఇంతకుముందు మరెవరూ చేయలేని విధంగా మోదీ కృషి చేసినట్టు ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కాలమ్ లో చౌదరి రాశారు.

More Telugu News