China: 60 ఏళ్లలో తొలిసారి తగ్గిన చైనా జనాభా.. కరోనా విలయమే కారణమా?

  • గతేడాది 8.5 లక్షలు తగ్గి 141 కోట్లకు చేరుకున్న జనాభా
  • 2022లో 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాల నమోదు
  • చైనాలో కరోనా వల్ల భారీగా మరణాలు సంభవించిన వైనం
China population shrinks for first time in over 60 years

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశమైన చైనాలో జనాభా తగ్గుతోంది.  60 ఏళ్లలో తొలిసారిగా ఆ దేశ జనాభాలో క్షీణత నమోదైంది. విదేశీయులు మినహా చైనాలో జనాభా 2022లో  8.5 లక్షల మంది తగ్గి 141 కోట్లకు చేరుకుందని ఆ దేశ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) మంగళవారం తెలిపింది. 2022 నాటికి దేశంలో 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలు నమోదయ్యాయి. విదేశీయులను మినహాయించి చైనా ప్రధాన భూభాగం జనాభా 2021 చివరి నాటికి 141 కోట్లకు పెరిగింది. కానీ, 2021లో కొత్త జననాలు 13 శాతానికి తగ్గాయని, 2020లో జననాల రేటు 22 శాతం తగ్గిందని ఎన్బీఎస్ డేటా వెల్లడించింది. 

మరోవైపు కరోనా విలయం వల్లనే చైనాలో జనాభా తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రజలు చనిపోయారని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 8, ఈ నెల 12వ తేదీ మధ్యనే చైనా ఆసుపత్రులలో సుమారు 60 వేల కరోనా మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, కరవు కారణంగా చివరగా 1960వ దశకం ప్రారంభంలో చైనాలో జనాభా తగ్గుదల నమోదైంది. ఆ తర్వాత 1980లో ఒక కుటుంబానికి ఒక బిడ్డ విధానాన్ని చైనా కఠినంగా అమలు చేసింది.  2021లో ఈ విధానాన్ని తొలగించింది.

More Telugu News