Mohammad-Mehdi Hosseini Hamedani: దేశంలో అందుకే వర్షాలు పడడం లేదు.. ఇరాన్ మత గురువు వివాదాస్పద వ్యాఖ్యలు

  • హిజాబ్ వ్యతిరేక అల్లర్లతో అట్టుడికిన ఇరాన్
  • ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశం
  • హిజాబ్ ధరించకపోవడం వల్లే వర్షాలు పడడం లేదన్న మతగురువు
  • మండిపడుతున్నజనం
Iran Imam Mehdi Hosseini Says Less Rain Result Of Women Without Hijab

హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ గతేడాది అట్టుడికిపోయింది. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 ఏళ్ల కుర్దిష్ యువతి మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వారి కస్టడీలోనే మృతి చెందింది. అమిని మరణం దేశ్యవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. హిజాబ్ వద్దంటూ మహిళలు రోడ్డుపైకి వచ్చారు. హిజాబ్‌లను తీసి నడిరోడ్డుపై మంటల్లో వేసి తగలబెట్టారు. దేశమంతా పాకిన ఈ అల్లర్లతో దిగి వచ్చిన ఇరాన్ ప్రభుత్వం నైతిక విభాగం పోలీసు (మొరాలిటీ పోలీసింగ్)ను రద్దు చేసింది. 

ఇదిలా ఉంచితే, దేశంలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాల కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మత గురువు మహ్మద్ మెహదీ హుస్సేనీ హమేదాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళల్లో కొందరు హిజాబ్ ధరించకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలపై దేశంలో మరోమారు దుమారం రేగింది. వర్షాలకు, హిజాబ్‌కు లంకె ఏంటంటూ జనం మండిపడుతున్నారు. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీకి మతగురువు మహ్మద్ మెహదీ అత్యంత సన్నిహితుడు.

More Telugu News