Australian Open: ప్రారంభమైన ఆస్ట్రేలియన్ ఓపెన్.... రెండో రౌండ్ లోకి నాదల్, మెద్వెదెవ్, స్వైటెక్

  • టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సీజన్ ప్రారంభం
  • శుభారంభం చేసిన నాదల్
  • జాక్ డ్రేపర్ పై నెగ్గిన రఫా
  • గాయంతో టోర్నీ నుంచి వైదొలిగిన కిర్గియోస్
Australian Open starts as defending champ Rafael Nadal entered into 2nd round

టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సీజన్ లో తొలి టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నేడు మెల్బోర్న్ లో ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ కాస్త కష్టంగా రెండో రౌండ్ లో ప్రవేశించాడు. తొలి రౌండ్ లో బ్రిటన్ కు చెందిన జాక్ డ్రేపర్ పై 7-5, 2-6, 6-4, 6-1తో నెగ్గాడు. తొలి సెట్ ను కష్టమ్మీద గెలిచిన నాదల్ కు రెండో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. డ్రేపర్ పుంజుకుని ఆ సెట్ ను కైవసం చేసుకున్నాడు. డ్రేపర్ ఈ మ్యాచ్ లో ఫిట్ నెస్ సమస్యలతో బాధపడ్డాడు. 

ఇక మరో మ్యాచ్ లో రష్యా స్టార్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అలవోకగా తొలి రౌండ్ దాటాడు. అమెరికా ఆటగాడు గిరోన్ ను 6-0. 6-1, 6-2 తేడాతో వరుస సెట్లలో మట్టికరిపించాడు. కేవలం రెండు గంటల్లోపే ఈ పోరు ముగిసిందంటే మెద్వెదెవ్ జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

ఇక, మూడో సీడ్ గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ కూడా శుభారంభం చేశాడు. తొలి రౌండ్ పోరులో సిట్సిపాస్ 6-3, 6-4, 7-6(6)తో గెలిచి రౌండ్ రౌండ్ చేరాడు. ఇక ఆరో సీడ్ ఫెలిక్స్ ఆగర్ అలియాస్సిమి కూడా రెండో రౌండ్ లో ప్రవేశించాడు. స్థానిక ఆటగాడు నిక్ కిర్గియోస్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 

మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ కూడా తొలి రౌండ్ లో విజయం సాధించింది. స్వైటెక్ 6-5, 7-5తో జర్మనీకి చెందిన జూల్ నీమియెర్ పై నెగ్గింది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలు నెగ్గి ఊపుమీదున్న స్వైటెక్ ఆస్ట్రేయలిన్ ఓపెన్ లో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టింది. 

అటు, ఏడో సీడ్ కోకో గాఫ్, పదో సీడ్ మాడిసన్ కీస్ కూడా రెండో రౌండ్ చేరారు. కోకో గాఫ్ రెండో రౌండ్ లో 2021 విజేత ఎమ్మా రదుకానుతో తలపడనుంది. బ్రిటన్ ఆశాకిరణం రదుకాను తొలి రౌండ్ పోరులో 6-3, 6-2తో టమారా కోర్పాష్ ను చిత్తుచేసింది.

More Telugu News