Pakistan: పాకిస్థాన్‌ను కుదిపేస్తున్న ఆహార సంక్షోభం.. గోధమపిండి ట్రక్‌ వెనక బైక్‌లతో ఛేజింగ్

Pakistan Suffering From Food Crisis People Chase wheat Truck on Bikes
  • తిండి కోసం అల్లాడిపోతున్న పాకిస్థాన్  ప్రజలు
  • గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ట్రక్‌ను ఛేజ్ చేసిన వందలాదిమంది
  • వీడియోను షేర్ చేసిన ప్రొఫెసర్ సజ్జద్ రజా
  • జమ్మూకశ్మీర్ ప్రజలు కళ్లు తెరవాలని సూచన
పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకుంది. తిండి  కోసం అల్లాడిపోతున్న ప్రజలు కడుపు నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దంపట్టే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కును చూసిన వందలాదిమంది గోధుమపిండిని కొనుగోలు చేసేందుకు దానిని బైకులతో వెంబడించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు వ్యక్తులు ట్రక్కు వెనకభాగంలోకి ఎక్కడం వీడియోలో కనిపిస్తోంది.

యూకేలోని సజ్జద్ రజా అనే ప్రొఫెసర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇది బైక్ ర్యాలీ కాదని, గోధుమ పిండి కోసం పాక్ ప్రజలు పడుతున్న కష్టాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్  ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. తాను పాకిస్థానీ కానందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో భవిష్యత్తు ఉందని ఇప్పటికీ భావిస్తున్నారా? అని ఆ ట్వీట్‌లో జమ్మూకశ్మీర్ ప్రజలను ఆయన ప్రశ్నించారు. 

కాగా, పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం రోజురోజుకు ముదురుతుండడంతో భద్రతా దళాల పర్యవేక్షణలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం రాయితీపై అందించే గోధుమ పిండి కోసం ఖైబర్ ఫక్తుంఖ్వా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిలబడుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు గోధుమపిండినే ఆహారంగా ఉపయోగిస్తారు. కాగా, పాకిస్థాన్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. మరోవైపు, పాక్‌లో విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటాయి.
Pakistan
Wheat Flour
Jammu And Kashmir

More Telugu News