Chandrababu: నారావారిపల్లెలో భోగి వేడుకలు.. సందడి చేసిన చంద్రబాబు.. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు

  • జీవో నంబరు-1ని భోగిమంటల్లో వేసి తగలబెట్టిన చంద్రబాబు
  • తాను భవిష్యత్ కోసం జీవిస్తున్నట్టు చెప్పిన టీడీపీ అధినేత
  • ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసం మొదలైందని ఆరోపణ
  • వచ్చే ఎన్నికలు జగన్‌కు, ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్యేనన్న చంద్రబాబు
Chandrababu Naidu Celebrates Bhogi in Naravari Palli

నారావారిపల్లెలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబరు-1ని భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను భోగి మంటల్లో వేసి బూడిద చేశామని, రాష్ట్రంలో సైకో పాలన పోవాలని కోరుకున్నట్టు చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాన్ని సాధించిపెడితే, తెలుగు వారికి ఎన్టీఆర్ గౌరవం తీసుకొచ్చారని అన్నారు. నాడు తాను ప్రోత్సహించిన ఐటీ సెక్టార్ ఉత్తమ ఫలితాలను ఇచ్చిందన్నారు. తెలుగు సినిమాకు దేశంలో ఎంత ఆదాయం వస్తోందో, ఓవర్సీస్‌లోనూ అంతే ఆదాయం వస్తోందని, దీనిని బట్టి మనవారు ఎంతగా విస్తరించారో అర్థం చేసుకోవచ్చన్నారు. 

కొందరు నేటి కోసం బతుకుతారని, మరికొందరు రేపటి కోసం జీవిస్తారని, తాను మాత్రం మీ భవిష్యత్ కోసం బతుకుతానని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 వరకు ఒక విజన్ సిద్ధం చేసుకోవాలని ఇటీవల జీ 20 చర్చల సందర్భంగా ప్రధానికి సూచించినట్టు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న చంద్రబాబు.. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభమైందన్నారు.
 
దేశంలో పెట్రోలు ధరలు, కరెంటు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదేనని, చెత్తపన్ను వసూలు చేస్తున్న రాష్ట్రం కూడా మనదేనని విమర్శించారు. గత 23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది సొంత ఊరు వచ్చి పండుగ చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ బిడ్డల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదని, ఆయన తండ్రి వైఎస్సార్ తనకు స్నేహితుడని అన్నారు.

జగన్ పాలనతో ఏపీ బ్రాండ్ నేమ్ పూర్తిగా దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాణ్యతలేని మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గాలు చేస్తున్న ప్రతి ఒక్కరి లెక్కలు రాసిపెడుతున్నానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి, వైసీపీకి మధ్య కాదని, 5 కోట్ల మంది ప్రజలకు, జగన్‌కు మధ్య అని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు సభ్యత లేకుండా పవన్ కల్యాణ్‌పై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఉండేందుకు జగన్‌కు అర్హత లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News