G.O.No.1: వివాదాస్పద జీవో నెం.1పై వివరణ ఇచ్చిన ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ

  • ఇటీవల జీవో నెం.1 తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
  • విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్
AP Law and Order DG explains Govt Order 1

ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జీవో నెం.1పై ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. అయితే, నియమనిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రజల భద్రత చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. 

ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ జీవో తీసుకువచ్చినట్టు డీజీ వెల్లడించారు. 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చారని వివరించారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ జీవోపై వాస్తవాలను మీడియా ప్రజలకు  వెల్లడించాలని సూచించారు. 

కాగా, మీడియా సమావేశంలో పాల్గొన్న మరో పోలీసు ఉన్నతాధికారి జీవోలోని అంశాలను చదివి వినిపించారు. రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించ వచ్చని తెలిపారు. 

ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని పేర్కొన్నారు. అయితే కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు వర్తిస్తుందని తెలిపారు.

More Telugu News