G2: జీ2గా వస్తున్న గూఢచారి సీక్వెల్.. అదిరిపోయిన అడివి శేష్ ఫస్ట్ లుక్

  • గూఢచారికి సీక్వెల్ ను ప్రకటించిన చిత్ర బృందం
  • ముంబైలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన శేష్
  • ప్రీ విజన్ వీడియో కూడా విడుదల
Still poster for G2  releases

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, చిన్న నటుడిగా కెరీర్ ఆరంభించిన అడివి శేష్ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు. వరుస హిట్లతో తన మార్కెట్ పరిధిని అనూహ్యంగా పెంచుకున్నాడు. మేజర్ చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకున్న శేష్.. గతేడాది హిట్ 2 చిత్రంతో మరో విజయం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ‘గూఢచారి’ సీక్వెల్‌ కోసం సిద్ధం అవుతున్నాడు. ‘జి2’ టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌‌ను ముంబైలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఫార్మల్ వేసుకున్నశేష్ బిల్డింగ్ పై నుంచి దూకుతూ తుపాకీ గురిపెట్టిన ఈ లుక్ సూపర్ గా ఉంది. పోస్టర్ తో పాటు ప్రీ విజన్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

 ఇందులో శేష్‌ను ఇండియా నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్లే గూఢచారిగా చూపించారు. గూఢచారి తొలి భాగం హిట్ తో శేష్ కెరీర్ ఊపందుకోగా.. రెండో పార్టుతో తను మరో స్థాయికి చేరుకునేలా ఉన్నాడు. ఈ చిత్రం కోసం శేష్ ప్రత్యేకంగా మేకోవర్ అయి మరింత స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం చెబుతోంది. 

ఇక ఈ సీక్వెల్ కు శేష్ కథను అందించాడు. మేజర్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More Telugu News